logo

ఈ భారీ విగ్ర‌హం ఎవ‌రిది ? ప్ర‌తీ ఒక్క‌రూ తెలుసుకోవాల్సిన రామానుజాచార్యుల చ‌రిత్ర‌

హైద‌రాబాద్ న‌గ‌ర శివార్ల‌లోని శంషాబాద్ స‌మీపంలోని ముచ్చింత‌ల్ అనే చిన్న గ్రామం ఇప్పుడు ప్ర‌పంచ దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఈ గ్రామంలో 216 అడుగుల భారీ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్ర‌హం శ్రీ భ‌గ‌వ‌ద్ రామానుజాచార్యుల వారిది. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన‌జీయ‌ర్ స్వామి ఆధ్వ‌ర్యంలో రామానుజాచార్యుల భారీ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్ర‌హానికి స‌మ‌తామూర్తి అని పేరు పెట్టారు. వెయ్యి సంవ‌త్స‌రాల క్రిత‌మే స‌మాజంలోని వివ‌క్ష‌ను రూపుమాపి అంద‌రూ స‌మాన‌మ‌నం చెప్పిన మ‌హ‌నీయులు రామానుజాచార్య‌లు. ఆయ‌న జీవిత చ‌రిత్ర‌ను తెలుసుకుందాం.

రామానుజాచార్యులు కేవ‌లం ఆథ్యాత్మిక వేత్త మాత్ర‌మే కాదు. ఆయ‌న సంఘ సంస్క‌ర్త‌. స‌మాజంలో అంద‌రూ స‌మాన‌మేన‌ని ప్ర‌వ‌రించిన మాన‌వ‌తామూర్తి. స‌నాత‌న ధ‌ర్మం గొప్ప‌ద‌నాన్ని ప్ర‌పంచానికి చెప్పిన మ‌హ‌నీయులు. రామానుజాచార్యులు త‌మిళ‌నాడులోని శ్రీ పెరంబ‌దూరులో 1017లో జ‌న్మించారు. ఆయ‌న త‌మిళ కాల‌మానం ప్ర‌కారం పింగ‌ళ సంవ‌త్స‌రంలో జ‌న్మించారు. ఆయ‌న ప‌ర‌మ‌ప‌దించింది కూడా పింగ‌ళ సంవ‌త్స‌ర‌మే. 60 ఏళ్ల‌కు ఒకసారి పింగ‌ళ సంవ‌త్స‌రం వ‌స్తుంది. కాబట్టి, ఆయ‌న 120 సంవ‌త్స‌రాలు జీవించి 1137లో మ‌ర‌ణించార‌ని చ‌రిత్ర‌కారులు చెబుతారు.

రామానుజాచార్యుల తండ్రి ఆసూరి కేశవాచార్యులు. తల్లి కాంతిమతి. కంచిలో ఆయ‌న విద్యాభ్యాసం జ‌రిగింది. చిన్న‌త‌నం నుంచే రామానుజాచార్యులు తెలివైన విద్యార్థి. గురువులు బోధించే విష‌యాల్లో హేతుబ‌ద్ధ‌త‌ను అర్థం చేసుకొని లోపాల‌ను క‌నిపెట్టేవారు. వ‌ర్ణ వివ‌క్ష బ‌లంగా ఉండే ఆ రోజుల్లోనే ప్ర‌జ‌లంతా ఒక‌టేన‌ని, వివ‌క్ష ఉండొద్ద‌ని, భ‌గ‌వంతుడి ముందు అంద‌రూ స‌మాన‌మేన‌ని రామానుజాచార్యులు బ‌లంగా విశ్వ‌సించారు. అదే బోధించారు. వివ‌క్ష‌ను రూపుమాపారు.

ఓ రోజు రామానుజాచార్యులకు ఆయ‌న గురువు ఓం న‌మో నారాయ‌ణాయ అనే మంత్రాన్ని ఉప‌దేశించి, ఈ మంత్రాన్ని ఎవ‌రికి చెప్పొద్ద‌ని, ర‌హ‌స్యంగా ఉంచ‌మ‌ని చెబుతారు. కానీ, అంద‌రికీ మంచి చేసే ఈ మంత్రాన్ని తాను ఒక్క‌డికే ప‌రిమితం కావొద్ద‌ని రామానుజులు భావిస్తారు. వెంట‌నే ఆల‌య గోపురం ఎక్కి అంద‌రికీ వినిపించేలా ఈ మంత్రాన్ని బిగ్గ‌ర‌గా ఉప‌దేశిస్తారు. ఈ మంత్రం బోధించడం వ‌ల్ల అంద‌రికీ స్వ‌ర్గం ల‌భించాల‌ని, ఇందుకు తాను న‌ర‌కానికి వెళ్ల‌డానికి కూడా సిద్ధ‌మైన‌ని రామానుజాచార్యులు చెప్ప‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.

ఆ రోజుల్లో ఆల‌య ప్ర‌వేశం కొన్ని కులాల‌కు నిషేధంగా ఉండేది. కానీ, రామానుజాచార్యులు ఇది త‌ప్ప‌ని చెప్పి ఆల‌య ప్రవేశం చేయిస్తారు. ఆ రోజుల్లో శైవులు, వైష్ణువుల మ‌ధ్య బేధాలు ఎక్కువ‌గా ఉండేవి. రామానుజాచార్యులు వైష్ణ‌వాచారానికి చెందిన వారు. వైష్ణ‌వాచారాన్ని ప్ర‌చారం చేసేవారు. ఈ స‌మ‌యంలోనే తిరుమ‌ల శ్రీనివాసుడికి సంబంధించి కూడా శైవులు, వైష్ణ‌వుల మ‌ధ్య వివాదం త‌లెత్తింది.

తిరుమ‌ల మూల‌విరాటు విష్ణుముర్తి విగ్ర‌హం కాద‌ని, శ‌క్తి విగ్ర‌హం లేదా శివ రూప‌మో అని శైవులు భావించారు. తిరుమ‌ల శ్రీనివాసుడు విష్ణుమూర్తి ప్ర‌తిరూపం అని రామానుజులు ఆధారాలతో నిరూపించారు. అంతేకాకుండా, బంగారంతో వైష్ణవాయుధాలు, శైవాయుధాలు, శక్తి ఆయుధాలు చేయించి స్వామివారి స‌న్నిధిలో పెట్టి త‌లుపులు మూయించారు. తెల్లారే స‌రికి శంకుచ‌క్రాలు స్వామి వారికి ఉన్నాయి. దీంతో అంద‌రూ స్వామివారు విష్ణుమూర్తి అని న‌మ్మారు.

తిరుమలలో స్వామివారి కైంకర్యాలు సక్రమంగా జరిగేలా చూసేందుకు రామానుజులు ఏకాంగి వ్యవస్థను ఏర్పరిచారు. తర్వాతి కాలంలో ఏకాంగి వ్యవస్థ జియ్యర్ల వ్యవస్థగా స్థిరపడడంలోనూ రామానుజుల పాత్ర కీలకం. ఇప్ప‌టికీ రామానుజాచార్యులు ప్ర‌వేశ‌పెట్టిన సంప్ర‌దాయాలు తిరుమ‌ల‌లో కొన‌సాగుతున్నాయి. తిరుపతిలో గోవిందరాజుల ఆలయాన్ని నిర్మింపజేసింది కూడా రామానుజులే. ఆ ఆలయం చుట్టూ ఆలయ పూజారులకు అగ్రహారమిచ్చి, వీధుల నిర్మాణం చేపట్టి యాదవరాజు తన గురువైన రామానుజుల‌ పేరిట రామానుజపురంగా రూపకల్పన చేశారు. అదే నేటి తిరుపతి నగరానికి పునాది అయ్యింది.

రామానుజాచార్యుల గురించి చిన‌జీయ‌ర్ స్వామి వారు కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు చెబుతారు. 11వ శ‌తాబ్ధంలోనే స‌మ‌స‌మాజం ఉండాల‌ని ఆయ‌న ఆకాంక్షించార‌ని, మ‌హిళ‌లు స‌మాజంలో ముందువ‌రుస‌లో ఉండాల‌ని కోరుకున్నారు. స‌మాజంలోని అన్ని వ‌ర్గాల‌కు స‌మాన అవ‌కాశాలు ఉండాలని బోధించారు. దీనిని వ్య‌తిరేకించిన కొంద‌రు రామానుజాచార్యుల‌ను అంతం చేసేందుకు తీర్థం, భోజ‌నంలో విషాన్ని క‌లిపినా కూడా దైవానుగ్ర‌హం వ‌ల్ల రామానుజాచార్యుల‌కు ఏమీ కాదు. కాబ‌ట్టి, స‌మ స‌మాజం కావాల‌ని ఆశించిన రామానుజాచార్యులు భవిష్య‌త్తు త‌రాల‌కు కూడా ఆద‌ర్శంగా నిల‌వాల‌నే స‌మ‌తా విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు.

Related News