మనం ఆఫీసులో పని ఎక్కువగా ఉందనో, టార్గెట్ పూర్తి చేయాలనో, బాస్ మెప్పు పొందాలనో ఆఫీస్ టైమింగ్స్‌కు మించి పని చేయడం సాధారణమే. చాలామంది ఇలా తొమ్మిది గంటల కంటే ఎక్కువగానే పని చేస్తుంటారు. ఇలా సమయానికి మించి పని చేయడం వల్ల మన వృత్తికి, మన ఉద్యోగానికి మంచి జరుగుతుందేమో కానీ మన ఆరోగ్యానికి మాత్రం చాలా నష్టం కలుగుతుంది. ఇప్పటికే వైద్యులు ఈ మాట చెబుతున్నారు. తాజాగా కెనెడాకు చెందిన ఓ పరిశోధనా బృందం చేసిన పరిశోధనలో మరిన్ని ప్రమాదకర విషయాలు బయటకు వచ్చాయి.
సాధారణంగా ఆఫీస్ టైమింగ్స్ అంటే రోజుకు ఎనిమిది గంటలు ఉంటాయి. కానీ, చాలామంది ఇంతకంటే ఎక్కువ గంటలు పని చేస్తుంటారు. ఇలా చేస్తే హైబీపీ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని కెనెడా పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ఇక్కడ మరో ప్రమాదకర విషయం ఏంటంటే హైబీపీ ఉన్నట్లు కూడా మనం గుర్తించలేమట.
భారత్‌తో పాటు వివిధ దేశాల్లోని ఉద్యోగులపై ఈ అధ్యయనం జరిగింది. వారానికి 35 గంటలు ఆఫీసులో ఉండటం వల్ల ఆరోగ్యానికి మంచిదేనని, అంతకు మించి ఉంటే నష్టమేనని తేలింది. వారానికి 35 గంటల కన్నా తక్కువగా పని చేసే వారితో పోల్చితే వారానికి 49 గంటలు, అంతకన్నా ఎక్కువ పని చేసే వారిలో 70 శాతం ఎక్కువగా హైబీపీ వచ్చే ప్రమాదం ఉందని ఈ అధ్యయనం చెబుతోంది.
ఆఫీసుల్లో ఎక్కువ సమయం పని చేసే వారికి హైబీపీ ఉన్న విషయాన్ని కూడా గుర్తించడం కష్టమవుతోందట. బీపీ రీడింగ్ తెలుసుకోవడం కష్టంగా ఉంటోందని, అందుకే హైబీపీ ఉన్న విషయాన్ని వీరు తెలుసుకోలేకపోతున్నారని ఈ అధ్యయనం చెబుతోంది. ఇందు వల్ల హైబీపీ వల్ల కలిగే అనర్థాల వల్ల వీరు మరింత ఎక్కువగా అనారోగ్యం పాలవుతున్నారని పరిశోధకులు తేల్చారు.
హైబీపీ వల్ల శరీరంలో అనారోగ్య సమస్యలు తీవ్రమైన తర్వాతనే తెలుసుకుంటుండటంతో నష్టం ఎక్కువగా జరుగుతోంది. ఇలా గుర్తించలేని హైబీపీ ఉన్న వారు ఆసుపత్రులకు వెళ్లినా హైబీపీ ఉన్నట్లు తెలియడం లేదని ఈ పరిశోధన చెబుతోంది. సరైన సమయంలో హైబీపీని గుర్తించకపోవడం చాలా ప్రమాదం. బీపీని కంట్రోల్లో పెట్టుకోకపోతే ప్రణాపాయానికి దారి తీసే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
కావున, ఆఫీసు టైమింగ్స్‌ను మించి పని చేయడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ఆఫీసులో పని చేసే సమయంలోనూ అదే పనిగా పనిలో మునిగిపోకుండా ప్రతీ గంటకు ఒకసారి ఐదు నిమిషాలు సీట్ నుంచి లేచి శరీరానికి కొంచెం రిలీఫ్ ఇవ్వాలని సూచిస్తున్నారు. రోజుకు ఎనిమిది గంటలకు మించి ఆఫీసులో ఉండి పని చేయడం ఏ మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.