ఏపీ ఎన్నికల కమిషనర్ కు మరోసారి షాకిచ్చింది హై కోర్టు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో రీ నామినేషన్లకు అనుమతులిస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన ఆదేశాలను తాజాగా హైకోర్టు కొట్టివేసింది. అదే విధంగా వాలంటీర్ల ట్యాబులను స్వాధీనం చేసుకోవాలంటూ ఇచ్చిన ఆదేశాలను కూడా కోర్టు కొట్టివేసింది.
రీ నామినేషన్లకు అవకాశం లేదని స్పష్టం చేసింది.
ఏపీలో రీ నామినేషన్లకు ఇచ్చిన గడువు ముగియడంతో కడప జిల్లా రాయచోటిలో 2 వార్డులు, ఎర్రగుంట్లలో 3 వార్డులు… చిత్తూరు జిల్లా తిరుపతి నగరపాలక పోరులో ఆరు డివిజన్లు, పుంగనూరు మున్సిపాలిటీలో మూడు వార్డులు ఇలా మొత్తం 14 చోట్ల రీ నామినేషన్లకు అవకాశం ఇస్తూ నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది.
గతంలో బెదిరింపుల కారణంగా అభ్యర్థులు నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నారని అందుకే రీ నామినేషన్లకు అవకాశం కల్పిస్తున్నామని నిమ్మగడ్డ వ్యాఖ్యానించారు. దీంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి అవకాశం ఇస్తూ ఉత్తర్వులను జారీ చేసారు. వార్డు వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని, వలంటీర్ల నుంచి ట్యాబులను స్వాధీనం చేసుకోవాలని నిమ్మగడ్డ ఆదేశించారు.
ఎస్ఈసీ ఆదేశాలను ఏపీ ప్రభుత్వం హై కోర్టులో సవాలు చేసింది. వార్డు వలంటీర్ల దగ్గర ఫోన్లను స్వాధీనం చేసుకోవాలన్న ఎస్ఈసీ ఆదేశాలపై హై కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన కోర్టు నిమ్మగడ్డ ఆదేశాలను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.