logo

జీహెచ్ఎంసీ ఎన్నికలపై పిటిషన్.. ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు!

హైదరాబాద్ లో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలపై స్టే విధించాలంటూ హై కోర్టులో పిల్ దాఖలైంది. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ దాఖలు చేసిన ఈ పిల్ పై నేడు హై కోర్టు విచారణ చేపట్టింది. సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా బీసీ రిజర్వేషన్లను అమలు పరుస్తున్నారని, ఈ విషయమై ఎన్నికలపై స్టే విధించాలని పిటీషనర్ తన వాదనలను న్యాయస్థానం ముందు వినిపించారు.

అయితే వాదనలు విన్న న్యాయస్థానం ఎన్నికలపై స్టే విధించలేమని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ ను విచారిస్తామని తెలిపింది. జీహెచ్‌ఎంసీ చట్టం‌ సెక్షన్‌ 52ఇ రిజర్వేషన్‌ పాలసీకి విరుద్ధంగా ఉందని, బీసీలను గుర్తించే ప్రక్రియ లేదని పిటిషనర్ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే ఎన్నికల షెడ్యూలు విడుదల చేయకుండా స్టే విధించాలని పిటిషన్ దాఖలు చేసిన దాసోజు శ్రవణ్ పై హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

బీసీలపై ఇంత ప్రేమ ఉన్న వారు గత పదేళ్ల నుంచీ ఎందుకు స్పందించలేదని, ఎన్నికల షెడ్యూల్ కు ముందే ఎలా గుర్తొచ్చిందని ప్రశ్నించింది. రాజకీయ దురుద్దేశ్యంతోనే పిటిషన్ ధాఖలైనట్టుగా న్యాయస్థానం అభిప్రాయపడింది. ఎన్నికల పై స్టే ఇవ్వలేమని తీర్పునిచ్చింది. అదేవిధంగా జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం, ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసీకి నోటీసులు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ ఆదేశించింది. అంతేకాకుండా 2015, 16 ఎన్నికలకు సంబంధించి దాఖలైన పిటిషన్ అన్నిటినీ జతపరచాలంటూ రిజిస్టర్ ను ఆదేశించింది.

Related News