తెలంగాణ రాష్ట్ర సమితి నేత, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై కొంతకాలంగా వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఆయనకు జర్మనీ పౌరసత్వం ఉన్నందున భారతీయ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హుడు కాదని కాబట్టి చెన్నమనేని ఎన్నికని కొట్టివేయాలంటూ హై కోర్టులో పిటిషన్ దాఖలైంది.
తాజాగా ఈ కేసులో హై కోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు విచారణలో భాగంగా చెన్నమనేని రమేష్ కు ఇప్పటికీ జర్మనీ పౌరసత్వం ఉందని కేంద్ర ప్రభుత్వం హై కోర్టుకు తెలియజేసింది. 2023 వరకు చెన్నేమేనేని జర్మనీ పౌరసత్వాన్ని పొడిగించుకున్నారని కేంద్ర హోమ్ శాఖ స్పష్టం చేసింది.
అయితే ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ రూపంలో కాకుండా మెమో రూపంలో సమర్పించడం పట్ల హైకోర్టు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చెన్నమనేని ఆ దేశ పౌరుడని తెలిపే విధంగా జర్మనీ ఎంబసీ నుంచి అఫిడవిట్ ను తేవాలని స్పష్టం చేసింది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో సమర్పించిన అదే మెమోను కేంద్రం మళ్ళీ కోర్టుకు సమర్పించడం పై అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఎంబసీ నుండి పౌరుని వివరాలు రాబట్టలేకపోతే మీ హోదాలు ఎందుకు అని న్యాయస్థానం కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ కేసుపై విచారణను జనవరి 20వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. అప్పటిలోపు జర్మన్ ఎంబసీ నుంచి పూర్తి వివరాలను సేకరించి తేవాలని కోర్టు ఆదేశించింది. అందుకు ఇంకా ఒక్క అవకాశం ఇస్తున్నట్టుగా కోర్టు వ్యాఖ్యానించింది.