పెద్దపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. హై కోర్టు న్యాయవాది గట్టు వామన్ రావు ఆయన భార్యను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. బుధవారం హైదరాబాద్ నుంచి మంథనికి కారులో వెళ్తుండగా రామగిరి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మార్గమధ్యంలో వామన్ రావు కారును అడ్డగించిన ఇద్దరు నిందితులు విచక్షణారహితంగా పొడిచి పారిపోయారు. ఈ ఘటనలో భార్య నాగమణి అక్కడికక్కడే మృతి చెందగా వామన్ రావు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు.
వేట కొడవళ్ళతో తమను తమను వెంబడించి దాడి చేశారని ప్రాణాలు పోయే ముందు వామన్ రావు పేర్కొన్నారు. తమపై దాడి చేసింది గుంజపడుగుకు చెందిన కుంట శ్రీనివాస్ అని మృతుడు పేర్కొన్నారు. కాగా పాత కక్షలే ఈ హత్యలకు కారణంగా తెలుస్తుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కొంతకాలంగా వామన్ రావు పలు భూవిభేదాల్లో కలగజేసుకునట్టుగా తెలుస్తుంది. అయితే ఈ వివాదాలతో అతని భార్యకు ఎలాంటి సంబంధం ఉంది ఆమెను ఎందుకు హత్య చేశారనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు.