కన్నడ స్టార్ హీరో యష్ విషాదంలో మునిగిపోయారు. యష్ వీరాభిమాని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోతూ తన చివరి కోరిక తీర్చాలంటూ తన అభిమాన హీరోను కోరాడు. అభిమాని లేఖతో యష్ భావోద్వేగానికి లోనయ్యారు. కర్ణాటక రాష్ట్రం మాండ్య జిల్లాకు చెందిన రామకృష్ణ(25) జీవితం పట్ల నిరాశ నిస్పృహలకు లోనయ్యి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
చనిపోతూ రామకృష్ణ రాసిన లేఖలో ‘జీవితంలో అన్ని విషయాల్లోనూ ఓటమి పాలయ్యాను. తల్లికి మంచి కొడుకుగా, నాకు సోదరుడిగా ఉడలేకపోయాను. ఆఖరికి ప్రేమలో కూడా ఓడిపోయాను. ఇక నా జీవితంలో సాధించడానికి ఏమీ లేదు’ అని తనువూ చాలించాడు. అయితే ఈ లేఖలో తాను హీరో యష్ కు కర్ణాటక మాజీ సీఎం సిద్దిరామయ్యకు వీరాభిమానినని పేర్కొన్నాడు.
వారిద్దరూ తనను చివరి చూపు చూసేందుకు రావాలని కోరాడు. కాగా సిద్దిరామయ్య రామకృష్ణ అంత్యక్రియలకు హాజరయ్యి సంతాపం ప్రకటించారు. యష్ తన అభిమాని మరణంపై సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. తాము అభిమానుల నుంచి కోరుకునేది కేరింతలు, చప్పట్లు మాత్రమేనని ఇది కాదంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.