తమిళ స్టార్ హీరో విజయ్ – సంగీతల వివాహం జరిగి ఆగస్టు 25వ తేదీ నాటికి 20 ఏళ్ళు పూర్తి చెసుకున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరి పెళ్లి పై ఓ ఆసక్తికర విషయం మరోసారి నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. తమిళనాట విజయ్ కు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో తెలిసిన విషయమే. అయితే విజయ్ తన వీరాభిమానినే పెళ్లి చేసుకుని షాకిచ్చాడు.
1996 సంవత్సరంలో విజయ్ హీరోగా ‘పూవే ఉనక్కగా’ అనే సినిమా విడుదలై విజయ్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమాతో తమిళనాడు లోనే కాకుండా ఇతర దేశాల్లో స్థిరపడిన తమిళ జనాలు కూడా విజయ్ కి అభిమానులుగా మారిపోయారు. అదే తెలుగులో ‘శుభాకాంక్షలు’ పేరుతో జగపతి బాబు హీరోగా రీమేక్ చేయబడింది. ఆ సినిమా విడుదలైన తర్వాత విజయ్ కెరీర్ పరంగా బిజీ అయిపోయాడు. ఓసారి ఓ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అతని కోసం ఓ అభిమాని వచ్చారు. విజయ్ ఆమెను పిలిచి కాసేపు మాట్లాడారు. ఈ క్రమంలో ఆమె విజయ్ కోసం ఏకంగా లండన్ నుంచి వచ్చిందని తెలుసుకుని ఆశ్చర్యపోయాడట.
ఆమె పేరు సంగీత. శ్రీలంకకు చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తె. వారి కుటుంబం లండన్ లో స్థిరపడింది. అయినా ఆమెకు తమిళ సినిమాలన్నా అందులో విజయ్ సినిమాలన్నా పిచ్చి ఇష్టమట. తనపై అభిమానంతో అంత దూరం నుంచి వచ్చిందని తెలిసి ఆమెను భోజానానికి ఇంటికి ఆహ్వానించాడట విజయ్. అప్పటికే తమిళ సినీ పరిశ్రమలో విజయ్ తండ్రి చంద్రశేఖర్ పెద్ద డైరెక్టర్. విజయ్ తల్లిదండ్రులకు కూడా సంగీత బాగా నచ్చింది. దీంతో ఈసారి వచ్చేటప్పుడు మీ తల్లిదండ్రులతో రావాలని ఆమెను కోరారు.
ఆ తర్వాత సంగీతను పెళ్లి చేసుకోవాలని విజయ్ ను కోరారట. అతనికి కూడా తనకు వీరాభిమాని అయిన సంగీతపై అప్పటికే అభిమానం, ప్రేమ ఏర్పడ్డాయి. దీంతో ఆమెను జీవిత భాగస్వామిగా చేసుకోవడానికి సిద్దమయ్యాడు. విజయ్ అంటే సంగీతకు ఎంత ఇష్టమో తెలిసిందే. వీరిద్దరూ కలిసిన మూడేళ్ళ తర్వాత 1999లో నిజాంజనే ఆమె తన తల్లిదండ్రులతో విజయ్ ఇంటికి వెళ్లారట. దీంతో వీరిద్దరి పెళ్లి అలా జరిగిపోయింది. వారికి ఇద్దరు పిల్లలు. కొడుకు జేసన్ సంజయ్. కుమార్తె దివ్య శాషా. అయితే సంగీత మాత్రం సినిమా పరిశ్రమకు సంబందించిన వేడుకల్లో ఎక్కువగా కనిపించరు. ఆమె కుటుంబ బాధ్యతలకె అధిక ప్రాధాన్యమిస్తారు.