ఆయుర్వేదంలో త్రిఫలా చూర్ణాన్ని సర్వరోగ నివారిణిగా పిలుస్తారు. ఇది ప్రకృతి సిద్ధమైన యాంటీ బయోటిక్. ఒక వ్యక్తి ఏదైనా అనారోగ్యంతో బాధపడుతుంటే వారిలో వాత, పిత్త, కఫ.. ఈ మూడింటిలో ఏదో ఒక సమస్య ఉందని భావిస్తారు. శరీరం లోపలి మలినాలను శుభ్రం చేసినప్పుడే ఈ దోషాలు తొలగిపోతాయి. వ్యర్ధ పదార్థాలను శరీరం నుంచి విసర్జించడంలో త్రిఫల చూర్ణం అద్భుతంగా పనిచేస్తుంది
ఉసిరి, కరక్కాయ, తానికాయల మిశ్రమమే త్రిఫల చూర్ణం. దీనిని నిత్య రసాయనంగా పిలుస్తారు. అంటే శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేది. ఉసిరికాయలో విటమిన్-సి అధికంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇమ్యూనిటీని, జీర్ణశక్తిని పెంచే గుణాలన్నీ ఉసిరికాయలో ఉన్నాయి. కరక్కాయ, తానికాయ కషాయ రస ప్రధానమైనవి. ఈ మూడింటిని కలిపి తీసుకుంటే జీర్ణ సంబంధమైన అన్ని సమస్యలు తొలగిపోతాయి.
నోట్లో పొక్కులు (అల్సర్లు), అజీర్తి, మలబద్ధ్దకం, అసిడిటీలకు త్రిఫల చూర్ణం బాగా పనిచేస్తుంది. కడుపుబ్బరం, గ్యాస్ సమస్యలకు ఇది విరుగుడు. త్రిఫల జీర్ణశక్తిని అభివృద్ధి చేయడమే కాకుండా వాతాన్ని కిందికి వెళ్లేటట్టు చేస్తుంది. అందువల్ల పేగుల కదలికలు బాగుంటాయి. చర్మ సంబంధిత వ్యాధులు ఉన్నవారికి ఇది ఇవ్వ ఔషధం. త్రిఫల చూర్ణాన్ని వాడేవారిలో ముఖం, శరీరం రంగు తేలి ఎలాంటి మచ్చలు లేకుండా అందంగా మారుతుంది.
త్రిఫలాలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు ఎదుగుదలను ప్రేరేపిస్తాయి. జుట్టు కుదుళ్లు బలంగా మారతాయి. తెల్లజుట్టును తగ్గిస్తుంది. కాలుష్యం కారణంగా పాడైన శిరోజాలకు తిరిగి జీవం పోస్తుంది. ఈ చూర్ణాన్ని క్రమంగా వాడే వారు అధిక బరువు తగ్గుతారని కొన్ని అధ్యయనాల్లో రుజువైంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. క్యాన్సర్ కారకాలతో పోరాడే శక్తి దీనికి ఉంది.
త్రిఫలా చూర్ణం చాలా శక్తివంతమైనది. శరీరంపై దీని ప్రభావం చాలా బలంగా ఉంటుంది. అందువల్ల సరైన మోతాదులో తీసుకోనివారిలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ను కలిగిస్తుంది. మోతాదు ఎక్కువైతే విరేచనాలు, అతిసారం బారినపడవచ్చు. బలహీనంగా ఉన్న వారు, శరీరం పొడిగా ఉండే వారు, గర్భణీ స్త్రీలు దీనిని తీసుకోకపోవడం మేలు. త్రిఫల చూర్ణంగా కాక విడిగా కరక్కాయను అజీర్ణ వ్యాధులకు, శ్వాస సంబంధ వ్యాధులు మొదలైన వాటికి వాడవచ్చు.
కరక్కాయను బుగ్గన పెట్టుకొని రసం మింగడం వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది. అంతేకాదు పళ్ళు, చిగుళ్ళ, నోటిలో పుండ్లు తగ్గెందుకు బాగా పనిచేస్తుంది. కరక్కాయతో కూడిన త్రిఫల చూర్ణం వాడుతున్నవారు ఒక పూట ఆహారంలో ఆవు నెయ్యి వేసుకొని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కంటి సంబంధిత వ్యాధులు ఉన్నవారు ఈ చూర్ణాన్ని ఉపయోగిస్తే ఆ సమస్యలు తొలగిపోతాయి.
కాళీ కడుపుతో దీనిని తీసుకోరాదు. త్రిఫల చూర్ణాన్ని గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ కలిపి రాత్రి పడుకోబోయే ముందు మాత్రమే తీసుకోవాలి. ఇతర అనారోగ్య సమస్యలకు వాడాలనుకునేవారు వైద్యుల సలహా తీసుకోవాలి. అయితే ఇలాంటి మందులు తక్షణ ఫలితాలను ఇవ్వలేవు. ఫలితం కనిపించడానికి కొంచెం సమయం పడుతుంది. ఇక త్రిఫలా చూర్ణాన్ని దీర్ఘకాలం పాటు వాడటం కూడా మంచిది కాదంటారు. ఇది శరీరానికి అలవాటు పడిపోయే ప్రమాదం ఉంది.