logo

  BREAKING NEWS

బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇక వారికి 10 శాతం రిజ‌ర్వేష‌న్లు  |   పంచాయతీ ఎన్నికలు: నిమ్మగడ్డకు ఉద్యోగ సంఘాల షాక్!  |   ‘కాబోయే సీఎం కంగ్రాట్స్’ వేదికపైనే షాకిచ్చిన మంత్రి.. కేటీఆర్ రియాక్షన్ ఇదే!  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రామ్‌చ‌ర‌ణ్‌తో ఇండియా టాప్ డైరెక్ట‌ర్ సినిమా..?  |   ‘గుంటూరు’కు చెందిన కోహినూర్ వజ్రం బ్రిటన్ చేతికి ఎలా వెళ్ళింది?  |   బ్రేకింగ్: పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. జ‌గ‌న్‌కు భారీ షాక్‌  |   వ్యాక్సిన్ అంద‌రూ తీసుకోవాలా ? క‌రోనా వ‌చ్చి త‌గ్గిన వారూ తీసుకోవాలా ?  |   గుర‌క పెడుతున్నారా..? ఈ చిట్కా పాటిస్తే జీవితంలో గుర‌క పెట్ట‌రు  |   వ‌కీల్ సాబ్ మ‌రో రికార్డు.. షూటింగ్ కాక‌ముందే రూ.15 కోట్లు వ‌చ్చేశాయి  |   తెలంగాణ కొత్త‌గా ఆరు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్క‌‌డో తెలుసా ?  |  

హ‌రీష్ రావు వ‌ర్సెస్ ర‌ఘునంద‌న్‌రావు

తెలంగాణ రాజ‌కీయాల్లో ట్ర‌బుల్‌షూట‌ర్ అన‌గానే ట‌క్కున గుర్తొచ్చే పేరు హ‌రీష్ రావు. అధికార టీఆర్ఎస్‌ పార్టీకి ఆయ‌న ఒక బ‌లం. ఉద్య‌మ స‌మ‌యంలోనైనా, అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాలైనా పార్టీకి ఎక్క‌డ అవ‌స‌రం ఎక్కువ ఉంటే అక్క‌డ అడుగుపెడ‌తారు హ‌రీష్‌రావు. ఉద్య‌మ స‌మ‌యంలో ప‌ర‌కాల‌, స్టేష‌న్ ఘ‌న్‌పూర్ వంటి క్లిష్ట‌మైన ఉప ఎన్నిక‌ల్లో పార్టీ గెలుపు బాధ్య‌త‌లు తీసుకొని టీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌ను గెలిపించిన హ‌రీష్‌రావు టీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చాక కీల‌క‌మైన నారాయ‌ణ‌ఖేడ్ ఉప ఎన్నిక‌, కొడంగ‌ల్ ఎన్నిక‌లో పార్టీని గెలిపించి త‌న స‌త్తా నిరూపించుకున్నారు.

ఇప్పుడు ఆయ‌న దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గంపై టార్గెట్‌ పెట్టారు. త‌న స్వంత నియోజ‌క‌వ‌ర్గం సిద్దిపేట ప‌క్క‌నే ఉంటుంది దుబ్బాక‌. ఇటీవ‌ల ఇక్క‌డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి మ‌ర‌ణించ‌డంతో ఇక్క‌డ ఉప ఎన్నిక అనివార్య‌మైంది. ఈ ఉప ఎన్నిక టీఆర్ఎస్‌కు అత్యంత కీల‌క‌మైన‌ది. ఇక్క‌డి నుంచి టీఆర్ఎస్ పార్టీ త‌ర‌పున రామ‌లింగారెడ్డి స‌తీమ‌ణి లేదా కుమారుడు పోటీ చేసే అవ‌కాశం ఉంది. అయితే, అభ్య‌ర్థి ఎవ‌ర‌నే విష‌యం ప‌క్క‌న పెడితే దుబ్బాక ఉప ఎన్నిక‌లో గెలుపు బాధ్య‌త మాత్రం హ‌రీష్‌రావుపైనే పెట్టారు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.

దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గంలో ఈసారి టీఆర్ఎస్‌కు బీజేపీ నుంచి గ‌ట్టి పోటీ ఎదురుకానుంది. బీజేపీ అభ్య‌ర్థిగా ర‌ఘునంద‌న్ బ‌రిలో దిగుతున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న దుబ్బాక‌లో విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గంలోని స‌గం గ్రామాల్లో ఒక విడ‌త ప‌ర్య‌టించారు కూడా. అసెంబ్లీలో ప్ర‌శ్నించే గొంతుగా త‌న‌ను గెలిపించాల‌ని ఆయ‌న దుబ్బాక ప్ర‌జ‌ల‌ను అభ్య‌ర్థిస్తున్నారు. ఇప్ప‌టికే టీఆర్ఎస్‌కు రాష్ట్రంలో 100కు పైగా ఎమ్మెల్యేలు ఉన్నందున దుబ్బాక‌లో టీఆర్ఎస్ గెలిస్తే ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఇంకా ఒక‌టి పెరుగుతుంద‌ని, అంతకుమించి ఏమీ జ‌ర‌గ‌ద‌ని ఆయ‌న ప్ర‌జ‌ల‌కు చెబుతున్నారు. త‌న‌ను గెలిపిస్తే రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రి పక్షాన అసెంబ్లీలో గ‌ళం వినిపిస్తాన‌ని కోరుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్ప‌టివ‌ర‌కు అభ్య‌ర్థిపై క్లారిటీ లేదు. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన మ‌ద్దుల నాగేశ్వ‌ర్‌రెడ్డి ఈసారి పోటీకి సిద్ధంగా లేరు. దీంతో కాంగ్రెస్ ఉప ఎన్నిక‌లో వెన‌క‌బ‌డిపోయింది. ప్ర‌స్తుతం టీఆర్ఎస్ వ‌ర్సెస్ బీజేపీ అన్న‌ట్లుగానే నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ క‌నిపిస్తోంది. గ‌తసారి త్రిముఖ పోటీ ఉండ‌టంతో ర‌ఘునంద‌న్‌రావు 22 వేల ఓట్లు తెచ్చుకొని మూడో స్థానంలో నిలిచారు. కానీ, ఈసారి ప్ర‌ధానంగా ద్విముఖ పోటీనే క‌నిపిస్తుంది. దీంతో టీఆర్ఎస్‌కు ప్ర‌త్యామ్నాయంగా ఓటేయాలి అనుకునే వారు బీజేపీ వైపు మొగ్గు చూపించ‌వ‌చ్చు. ఇదే జ‌రిగితే ర‌ఘునంద‌న్‌రావుకు ఈసారి భారీగా ఓట్లు పెరిగే అవ‌కాశాలు ఉన్నాయి.

బీజేపీ నుంచి పోటీ తీవ్రంగానే ఉండే అవ‌కాశాలు ఉండ‌టంతో టీఆర్ఎస్ పార్టీ అప్ర‌మ‌త్త‌మైంది. హ‌రీష్‌రావును దుబ్బాక‌లో దించింది. అక్క‌డ అభ్య‌ర్థిని గెలిపించే బాధ్య‌త‌లు తీసుకున్న హరీష్ పూర్తిగా దుబ్బాక‌పైన దృష్టి పెట్టారు. నియోజ‌క‌వ‌ర్గంలో త‌ర‌చూ ప‌ర్య‌టిస్తున్నారు. పెద్ద ఎత్తున అభివృద్ధి ప‌నులను ప్రారంభిస్తున్నారు. అనేక అభివృద్ధి ప‌నుల‌కు సంబంధించి ప్ర‌జ‌ల‌కు హామీలు ఇస్తున్నారు. బీజేపీకి ప‌ట్టున్న గ్రామాలపై, బీజేపీ వైపు నిలు‌స్తున్న నాయ‌కుల‌పై ఆయ‌న ప్ర‌త్యేక దృష్టిపెట్టారు. హ‌రీష్‌రావు రంగ ప్ర‌వేశం చేయ‌డంతో టీఆర్ఎస్‌కు ఒక్క‌సారిగా కొంత సానుకూల వాతావ‌ర‌ణం మొద‌లైంది.

అయితే, 2018 దుబ్బాక ఎన్నిక‌లో సోలిపేట రామ‌లింగారెడ్డి ఏకంగా 63 వేల ఓట్ల భారీ మెజారిటీతో విజ‌యం సాధించారు. ఇప్పుడు ఆయ‌న మర‌ణం కార‌ణంగా సానుభూతి ఉంటుంది. ఈ లెక్క‌న గ‌తానికి మించిన మెజారిటీ టీఆర్ఎస్‌కు ద‌క్కాలి. కానీ, ర‌ఘునంద‌న్‌రావు రూపంలో టీఆర్ఎస్‌కు గ‌ట్టి పోటీ ఎదుర‌వుతున్న నేప‌థ్యంలో అంత భారీ మెజారిటీ వ‌స్తుంద‌ని క‌చ్చితంగా చెప్ప‌లేని ప‌రిస్థితి క‌నిపిస్తోంది. మొత్తానికి దుబ్బాక‌లో టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్య‌ర్థులు ఎవ‌ర‌నేది ప‌క్క‌న పెడితే హ‌రీష్ రావు వ‌ర్సెస్ ర‌ఘునంద‌న్‌రావు మ‌ధ్యనే రాజ‌కీయం న‌డుస్తోంది.

Related News