ప్రస్తుతం కరోనా బారిన పడుతున్న వారికి సంజీవని లాంటిది 2డీజీ డ్రగ్. కరోనా వైరస్ నుంచి బాధితులు వేగంగా కోలుకునేందుకు, ఆక్సీజన్ అవసరం తగ్గించేందుకు ఈ డ్రగ్‌ను వినియోగిస్తున్నారు. ఈ ఔషదం పూర్తి పేరు 2డియాక్సీ డీ గ్లూకోజ్. డిఫెన్స్ రీసెర్చ్ ఆండ్ డెవెలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీఏ) ఆధ్వర్యంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ ఆండ్ అలైడ్ సైన్సెస్ సంస్థ, డాక్టర్ రెడ్డీస్ సంస్థ సహకారంతో ఈ డ్రగ్‌ను రూపొందించింది.
ఇప్పటికే ఈ డ్రగ్‌ను కరోనా బాధితులకు వినియోగించేందుకు డీజీసీఐ అత్యవసర అనుమతి ఇచ్చింది. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, డాక్టర్ హర్షవర్ధన్ ఈ ఔషదాన్ని విడుదల కూడా చేశారు. సాచెట్ల రూపంలో గ్లూకోజ్ పౌడర్‌ను పోలి ఈ డ్రగ్ ఉంటుంది. ఒక్కో సాచెట్ ధర రూ.990గా నిర్ణయించారు. డాక్టర్ రెడ్డీస్ సంస్థ ఈ డ్రగ్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటికే అందుబాటులో వచ్చింది. త్వరలోనే మార్కెట్లోకి రానుంది.
అయితే, ఈ డ్రగ్ వాడకానికి సంబంధించి కేంద్ర వైద్యారోగ్య శాఖ కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. వైద్యుల సూచన మేరకే, వైద్యుల ప్రిస్క్రిప్షన్ ప్రకారమే ఈ డ్రగ్ వాడాలని స్పష్టం చేశారు. నీటిలో ఈ డ్రగ్ కలుపుకొని తాగాల్సి ఉంటుంది. కరోనా బారిన పడిన వారికి ఈ డ్రగ్ ఎంత త్వరగా ఇస్తే అంత మంచిది. గరిష్ఠంగా 10 రోజుల్లోపే ఈ డ్రగ్ ఇవ్వాలని కేంద్రం చెప్పింది.
ఒక మోస్తారు లక్షణాలు ఉన్న వారి నుంచి తీవ్రమైన లక్షణాలు ఉన్న కరోనా బాధితులకు ఈ డ్రగ్ ఇవ్వవచ్చు. గర్భిణులు, పాలిచ్చే తల్లులు, 18 ఏళ్ల లోపు వారికి ఈ డ్రగ్ ఇవ్వొద్దని కేంద్రం స్పష్టం చేసింది. షుగర్ కంట్రోల్లో లేని వారికి, తీవ్రమైన గుండె సమస్యలు ఉన్నవారికి, కాలేయ, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారికి, ఏఆర్డీఎస్ ఉన్న వారికి ఈ డ్రగ్ ఇచ్చే సమయంలో వైద్యులు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచించింది.
ఇప్పటికే 2డీజీ డ్రగ్‌ను కరోనా చికిత్సలో వాడుతున్నారు. ఇది బాగా పనిచేస్తోందని వైద్యులు గుర్తించారు. ఇది వాడిన పేషెంట్లలో ఆక్సీజన్ అవసరం 42 శాతం తగ్గిందని తేలింది. పట్టాల్సిన సమయం కంటే రెండున్నర రోజుల ముందే కోలుకుంటున్నారు. గ్లూకోజ్ లాంటి ఈ డ్రగ్ నేరగా కరోనా వైరస్ ఉన్న కణాల్లోకి చేరి వైరస్ వృద్ధి చెందకుండా అడ్డుకుంటుంది. దీంతో వైరస్ శరీరంలో వ్యాపించడానికి అవకాశం ఉండదు. బాధితులు వేగంగా కోలుకుంటారు.