జీహెచ్ఎంసీ ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటం.. ప్రచారానికి చాలా తక్కువ సమయం ఉండటంతో ప్రధాన పార్టీలన్నీ వేగాన్ని పెంచాయి. ఎన్నికల ప్రచారంతో భాగ్యనగరం వేడెక్కుతోంది. రాజకీయ నాయకులు విమర్శలు ప్రతివిమర్శలు చేస్తూ నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కానీ ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికలు ఇద్దరు సినీ నటుల మధ్య చిచ్చు పెట్టాయి. దీంతో ఎన్నికల వేడి ఇప్పుడు టాలీవుడ్ ను తాకింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్ట్రాటజీ, అనుభవంపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇటీవల హైదరాబాద్ వచ్చిన ప్రకాష్ రాజ్ ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..
ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీకి మద్దతునిచ్చి పవన్ కళ్యాణ్ అందరినీ నిరాశపరిచాడు. గత సాధారణ ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఓటింగ్ శాతం ఎంతో వచ్చిందో తెలిసి కూడా ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి పవన్ ఎందుకు వెళ్తున్నారు. 2014 లో ఎన్డీఏ తరపున ప్రచారం చేసిన పవన్ మోదీని గొప్పవారంటూ పొగిడారు. కానీ 2019 లో లెఫ్ట్ పార్టీలతో కలిసి మోదీని, టీడీపీని విమర్శించారు. పవన్ కళ్యాణ్ మాటమారుస్తున్నారని ఆయన ఒక ఊసరవెల్లి అని ప్రకాష్ రాజ్ కామెంట్ చేసారు. పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలను పవన్ సోదరుడు నాగబాబు తీవ్రంగా ఖండించారు.
”రాజకీయల్లో నిర్ణయాలు అనేకసార్లు మారుతుంటాయి. ఆ నిర్ణయాల వెనుక ఉద్దేశ్యం లాంగ్ టర్మ్‌లో ప్రజలకు, పార్టీకి ఉపయోగపడే విధంగా ఉంటాయి. మా నాయకుడు పవన్ కళ్యాణ్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలపడం వెనుకు విస్తృత ప్రయోజనాలు ఉన్నాయని నా నమ్మకం. ఎవరికి ద్రోహం చేశాడని ప్రతి పనికిమాలినవాడు విమర్శిస్తున్నాడు. ప్రశాష్ రాజ్ డొల్లతనం ఏంటో బీజేపీ ఎంపీ సుబ్రహ్మస్వామి డిబేట్లోనే అర్థం అయ్యింది. నిన్ను తొక్కి నారతీస్తుంటే మాట్లాడలేక తడబడటం నాకు ఇంకా గుర్తుంది. నీ దృష్టిలో బీజేపీ తీసుకునే నిర్ణయాలు నచ్చకపోతే విమర్శించు తప్పులేదు.
మంచి చేస్తే మెచ్చుకోలేని నీ కుసంస్కారం గురించి ఏం చెప్పగలం. ఈ దేశానికి బీజేపీ, ఏపీకి జనసేన పార్టీతోనే అభివృద్ధి సాధ్యం. నీలాంటి కుహనా మేధావులు ఎన్ని వాగినా బీజేపీ, జనసేన విజయాన్ని ఆపలేరు. బీజేపీ నేతల్ని నువ్వు ఎన్ని మాటల అన్నా వాళ్లు నిన్ను ఏమీ అనడంలేదంటే ఆ పార్టీ ప్రజాస్వామ్యానికి ఇచ్చే విలువ ఏంటో అర్థం చేసుకో. నిర్మాతలని డబ్బు కోసం ఎన్ని రకాలుగా హింస పెట్టావో, డేట్స్ ఇచ్చి రద్దు చేసి ఎంత హింసకు గురిచేశావో అన్నీ గుర్తున్నాయి. మరోసారి పవన్ గురించి మాట్లాడే ముందు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లా”డాలంటూ నాగబాబు వ్యాఖ్యానించారు.