గ్రీన్ టీ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే. గ్రీన్‌టీ తో తాగడం ద్వారా బరువు తగ్గుతాము. గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. రోజంతా ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండటానికి గ్రీన్‌టీ బాగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. తాజాగా శాస్త్రవేత్తలు ఒక కొత్త విషయాన్ని చెప్పారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో గ్రీన్‌టీ బాగా పని చేస్తోందని ఒక పరిశోధనలో వెల్లడైంది.
యూకేలోని స్వాన్సీ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు డాక్టర్ సురేష్ మోహన్ కుమార్ ఆధ్వర్యంలో ఒక గ్రీన్టీపై ఒక పరిశోధన చేశారు. డా.సురేష్ మోహన్ కుమార్ భారతీయుడు. ఆయన స్వాసీలో ప్రోఫెసర్‌గా చేరడం కంటే ముందు మనదేశంలోనే ఊటీలో శాస్త్రవేత్తగా పని చేశారు. భారత్‌లో ఉన్నప్పుడే ఆయన తన తోటి పరిశోధకులతో కలిసి గ్రీన్టీపైన పరిశోధనలు ప్రారంభించారు. లండన్‌కు వెళ్లిన తర్వాత స్వాన్సీ యూనివర్సిటీ వారితో కలిసి ఈ పరిశోధన కొనసాగించారు.
గ్రీన్‌టీలో ఉండే గాల్లోకెటాచిన్ అనే ఒక పదార్థానికి కరోనా వైరస్‌ను ఎదుర్కొనే సామర్థ్యం ఉందని వీరు గుర్తించారు. ప్రకృతిలో లభించే వివిధ పదార్థాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కంప్యూటర్ ప్రోగ్రాం ద్వారా పరీక్షించగా గ్రీన్‌టీలో ఉండే పదార్థానికి కరోనాను ఎదుర్కొనే శక్తి ఉందని తేలినట్లు మోహన్ కుమార్ పేర్కొన్నారు. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు ఆర్ఎస్సీ అడ్వాన్సెస్ అనే సైన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
అయితే, ఇప్పటివరకు ఈ పరిశోధన ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, తమ పరిశోధనలో తేలిన ఈ విషయాన్ని క్లినికల్‌గా ప్రూవ్ చేయాల్సి ఉంటుందని, ఇందుకు మరింత లోతుగా పరిశోధనలు జరపాల్సిన అవసరం ఉంటుందని డా.సురేష్ మోహన్ కుమార్ పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయి పరిశోధకులతో కలిసి మరింత లోతైన పరిశోధనలు జరపాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రకృతిలో ఇన్ఫెక్షన్లను జయించే పదార్థాలు ఉన్నాయని, వీటిని గుర్తించి వినియోగిస్తే వైరస్‌లను జయించవచ్చని ఆయన అంటున్నారు.