యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన కారు ప్రమాదంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. నల్గొండలో జరుగుతున్న ఓ కార్యక్రమానికి దత్తాత్రేయ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు వెళ్తుండగా చౌటుప్పల్ మండలం ఖైతాపురం గ్రామ శివారులో జాతీయ రహదారిపై అయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.
దత్తాత్రేయ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లింది. ఆ సమయంలో కారులో మరికొందరు అధికారులు కూడా ఉన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటి తరువాత దత్తాత్రేయ మరో వాహనంలో సూర్యాపేట బయలుదేరి వెళ్లారు. కాగా వేగంగా వస్తున్న వాహనం ఒక్కసారిగా అదుపుతప్పడంతో సెక్యూరిటీ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. అంతా సురక్షితంగా బయటపడటంతో ఊపిరిపీల్చుకున్నారు.