ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ప్రసంగించారు. ఈ ప్రసంగంలో మూడు రాజధానుల అంశం పై కీలక వ్యాఖ్యలు చేసారు. మూడు రాజధానులపై తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసమే మూడు రాజధానుల విధానం తీసుకొచ్చామన్నారు.
అన్ని ప్రాంతాల అభివృద్దే తమ ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు. అమరావతి శాసన రాజధానిగా, విశాఖ పట్నం కార్య నిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటాయని మరోసారి స్పష్టం చేసారు. ప్రస్తుతం మూడు రాజధానుల బిల్లు శాసన ప్రక్రియలో ఉందన్నారు. భవిష్యత్తులో తమ ప్రభుత్వానికి మంచి రోజులు వస్తాయని త్వరలోనే ఈ బిల్లు ఆమోదం పొందివుతుందని గవర్నర్ ధీమా వ్యక్తం చేసారు.
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు విషయమై గతంలో నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే శాసన మండలిలో మాత్రం ఈ బిల్లుకు ఆమోదం లభించలేదు. మరోసారి ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టె ఆలోచనలో వైసీపీ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనిపై స్పందించిన ఏపీ ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి.. ఈ అంశంపై బీఏసీలో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామన్నారు. తమ ప్రభుత్వానికి అన్ని ప్రాంతాలు సమానమే అని వ్యాఖ్యానించారు.