ఈ రోజుల్లో సంతానలేమి సమస్య ఉన్న దంపతుల సంఖ్య బాగా పెరిగిపోతోంది. తల్లి కావాలనే కోరిక చాలామందికి నెరవేరడం లేదు. అందుబాటులోకి వచ్చిన అధునాతన వైద్య చికిత్సలు సంతానం లేక బాధపడుతున్న వారికి వరంలాగా మారాయి. ముఖ్యంగా ఐయూఐ, ఐవీఎఫ్ పద్ధతుల ద్వారా చాలా మందికి సంతానభాగ్యం కలుగుతోంది.
ఐయూఐ అంటే ఇంట్రాయుటెరైన్ ఇన్సెమినేషన్ అని అర్థం. ఈ పద్ధతిలో భర్త నుంచి వీర్యాన్ని సేకరించి ల్యాబ్‌లో శుద్ధి చేసి హైలీ కాన్సన్ట్రేటెడ్ మొటిలిటీ స్పెర్మ్‌గా మార్చి భార్య అండాశయంలోకి ప్రవేశపెడతారు. ఇక, ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అని అర్థం. ఇందులో ల్యాబ్‌లోని పిండం ఫలదీకరణ చేసి తర్వాత మహిళ గర్భంలోకి ప్రవేశపెడతారు.
ఐయూఐ పద్ధతికి కొంత తక్కువగానే డబ్బు ఖర్చు అవుతుంది. కానీ, ఐవీఎఫ్ పద్ధతికి సుమారు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతోంది. కొంత ఆర్థిక స్థోమత ఉన్న వారు ఇంత ఖర్చును భరించగలుగుతారు. కానీ, పేదవారు ఇంత ఖర్చు పెట్టలేరు. పెట్టాలనుకున్నా అప్పులు చేయాల్సి ఉంటుంది. కాబట్టి, పేద దంపతులకు ఈ చికిత్సలు అందడం లేదు. సంతానం భాగ్యం కలగాలనే వారి ఆశ తీరడం లేదు.
ఇలాంటి వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పబోతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే సంతాన సాఫల్య కేంద్రాలు ప్రారంభించి ఉచితంగా ఐయూఐ, ఐవీఎఫ్ చికిత్సలు అందించాలని భావిస్తోంది. ముందుగా హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి, పేట్లబుర్జు ఆసుపత్రితో పాటు వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో ఈ కేంద్రాలను త్వరలోనే అందుబాటులోకి తీసుకురావడానికి వైద్యారోగ్య శాఖ కసరత్తు చేస్తోంది.
ఈ కేంద్రాలు ప్రారంభమైతే లక్షలు ఖర్చయ్యే సంతాన సాఫల్య చికిత్సలు ఉచితంగానే చేయించుకునే వీలు కలుగుతుంది. పైగా దంపతులకు ఎలాంటి సమస్యలు లేకపోయినా ప్రైవేటు సంతాన సాఫల్య కేంద్రాల్లో ఐయూఐ, ఐవీఎఫ్ చికిత్స చేస్తూ డబ్బులు ఖర్చు చేయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఈ కేంద్రాలు ప్రారంభమైతే ఇలాంటి అక్రమాలు కూడా తగ్గుతాయి. మరో రెండు మూడు నెలల్లోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ కేంద్రాలు ప్రారంభం కాబోతున్నాయి.