తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి రోజు రోజుకి ఉధృతంగా మారుతుంది. ఈ నేపథ్యంలో కరోనా నివారణలో అత్యంత కీలకమై కరోనా పరీక్షలను అధికంగా జరిపించడం లేదని ప్రభుత్వం పై విమర్శలు వస్తున్నా విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ స్పందించారు. కేసీఆర్ ప్రభుత్వం పై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
ఇటీవల జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవర్నర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. కరోనా కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కరోనా నియంత్రణలో భాగంగా రాష్ట్రంలో అధికంగా టెస్టులు చేయాలని, మొబైల్ టెస్టింగ్ వ్యాన్ లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని పలు మార్లు కోరామని అన్నారు. ఈ విషయంపై ఇప్పటికే ఐదు సార్లు లేఖ రాసిన ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని అన్నారు.
రాష్ట్రంలో కరోనా తీవ్రతపై ఇటీవల తిరిగిన సమావేశంలో కూడా ప్రభుత్వాన్ని గట్టిగానే హెచ్చరించానని అయితే ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకే పరీక్షలు జరుపుకున్నామని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేసారు. కరోనా తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో సైతం ప్రభుత్వ ఉదాసీనంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేసారు.
రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల తీరుపై కూడా తమిళసై వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అంధక ప్రజలు అటువైపు వెళ్ళడానికి జంకుతున్నారని ప్రైవేటు ఆసుపత్రుల వైపే మొగ్గు చూపుతున్నారన్నారు. మంత్రులు వచ్చి ప్రభుత్వాసుపత్రులకు రావాలని కోరినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని కీలక వ్యాఖ్యలు చేసారు.