కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది. త్వరలోనే దేశవ్యాప్తంగా ఉద్యోగులకు శుభవార్త వినిపించనుంది. కొత్త లేబర్ కోడ్ ను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ పరిశీలన చేస్తుంది. ఈ కోడ్ ప్రకారం కార్మికులు వారానికి 48 గంటలు పని చేయాల్సి ఉంటుంది. మూడు రోజులు సెలవులు తీసుకోవచ్చు.
అయితే ఆ నాలుగు రోజుల్లో కార్మికులు రోజుకి 12 గంటల పాటు పని చేయాల్సి ఉంటుంది. మధ్యలో ఒక గంట విరామం ఉంటుంది. అయితే ఈ కోడ్ ను అమలు చేయడానికి ఉద్యోగులు, యజమానులు అనుమతులు ఇద్దరి సమ్మతం అవసరమని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర వెల్లడించారు.
వారానికి ఎన్ని రోజుల పని అనే విషయంలో కేంద్రం ఎవ్వరినీ ఒత్తిడి చేయదని అయితే కొత్త కోడ్ కారణంగా ఉద్యోగులకు, కంపెనీలకు కాస్త వెసులుబాటు కలుగుతుందని అన్నారు. ఉద్యోగులు సెలవు రోజుల్లో తమ సొంత పనులు చేసుకోవడానికి, కుటుంబంతో గడపడానికి సమయం కేటాయించే అవకాశం ఉంటుదన్నారు.
డిసెంబర్లో రూపొందించిన ముసాయిదా నిబంధనలను అనుసరించి, 2020 సెప్టెంబర్లో పార్లమెంటులో నాలుగు లేబర్ కోడ్లను కేంద్రం ఆమోదించింది. కార్మిక నియమాలకు తుది మెరుగులు దిద్దుతోందని, రాష్ట్రాలు కూడా తమ సొంత నిబంధనల ముసాయిదాతో వస్తున్నాయని అపూర్వ చంద్ర వెల్లడించారు.