ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు, ఎవరికి, ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో బాగా తెలుసు. తన కోసం కష్టపడ్డవారికి, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు జెండా మోసిన వారికి పెద్ద పీట వేస్తూనే రాజకీయంగా ప్లస్‌లు, మైనస్‌లు చూసుకొని పదవులు భర్తీ చేయడం ద్వారా జగన్ తన మార్క్ చూపిస్తున్నారు. ఇటీవల పెద్ద ఎత్తున నామినేటెడ్ పదవులను భర్తీ చేసిన జగన్ త్వరలో మరిన్ని కీలక పదవులను కూడా భర్తీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.
ఇందులో భాగంగా మంచు కుటుంబం నుంచి ఒకరికి ఒక కీలక పదవి ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఇటీవల మోహన్‌బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ తాడేపల్లి వెళ్లి ముఖ్యమంత్రి జగన్‌ను కలిసినట్లు తెలుస్తోంది. ఒకప్పుడు మోహన్ బాబు దివంగత ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉండేవారు. టీడీపీలోనూ ఆయన కీ రోల్ పోషించారు. చంద్రబాబుతో కలిసి వ్యాపారాలు కూడా చేశారు.
కానీ, అనంతర కాలంలో చంద్రబాబుతో గొడవల కారణంగా ఆయన టీడీపీకి దూరమయ్యారు. ఆ తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితుడయ్యారు. అంతేకాదు, వైఎస్సార్‌కు స్వయాన తమ్ముడితో మోహన్ బాబు వియ్యం అందుకున్నారు. వైఎస్సార్ సోదరుడి కుమార్తె విరోనికాను మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు వివాహం చేసుకున్నారు. దీంతో వైఎస్సార్ కుటుంబంతో మంచు కుటుంబానికి బంధుత్వం కూడా ఏర్పడింది.
నిజానికి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల ముందు వరకు అంతగా పట్టు లేదు. టాలీవుడ్ బిగ్ షాట్స్ అంతా అటు టీడీపీకి లేదా ఇటు జనసేనకు అనుకూలంగా ఉండేవారు. ఇటువంటి సమయంలో గత ఎన్నికల ముందు మోహన్ బాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన చేరిక వైసీపీకి ఎంతో కొంత కలిసి వచ్చింది. అయితే, వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా మోహన్ బాబు కుటుంబానికి ఇంత వరకు రాజకీయంగా ఎటువంటి ప్రాధాన్యత దక్కలేదు.
దీంతో, ఇప్పటికైనా ఈ కుటుంబానికి తగిన గౌరవం ఇవ్వాలని జగన్ భావిస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగా త్వరలో ఖాళీ కానున్న ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ పదవిని మోహన్ బాబు కుమారుల్లో ఒకరికి ఇవ్వాలనే ఆలోచనతో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మోహన్ బాబును రాజ్యసభకు పంపించే అవకాశం కూడా ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఒక సామాజకవర్గానికి జగన్ వ్యతిరేకి అని రాష్ట్రంలో టీడీపీ, దాని అనుకూల మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో అదే సామాజకవర్గానికి చెందిన మోహన్ బాబు కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఆ ప్రచారాన్ని తిప్పికొట్టినట్లు కూడా అవుతుంది.