ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల తీవ్రత విపరీతంగా పెరిగింది. భారత్ లో ఇపుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పటికే మన దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య కోటి దాటేసింది. ఈ క్రమంలో చాలా మంది ఈ వైరస్ తో పోరాడిగెలిచారు. అయితే కరోనా నుంచి కోలుకున్న వారిలో యాంటీబాడీలు ఎన్ని రోజుల వరకు ఉంటాయనే విషయం తెలుసుకోవడానికి ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాకు చెందిన ఓ యూనివర్సిటీ పరిశోధకులు కరోనా నుంచి కోలుకున్న వారికి శుభవార్త చెప్పారు. వారు చేపట్టిన అధ్యయనంలో కరోనా నుంచి కోలుకున్నవారి గురించి కొన్ని కీలక విషయాలను వెల్లడించారు.
ఒకసారి కరోనా వచ్చి కోలుకున్న వారికి ఈ వైరస్ నుంచి దాదాపు ఎనిమిది నెలల వరకు రక్షణ లభిస్తుందని వెల్లడించారు. ఆస్ట్రేలియాలోని మోనాయిష్ యూనివర్సిటీకి చెందిన నిపుణులు కొంతమంది కరోనా రోగులపై 250 రోజులపాటి పరిశోధనలు జరిపారు. కరోనా బారిన పడిన వారిలో రోగనిరోధక శక్తికి చెందిన మెమరీ బి సెల్స్, టీ సెల్స్ ను శాస్త్రవేత్తలు గుర్తించారు. మెమరీ బీ సేల్స్ యాంటీ బాడీలను ఉతపట్టి చేస్తాయి. ఇవి కరోనా వైరస్ ను గుర్తుపెట్టుకుంటాయి. ఒక వేళ రెండవసారి కరోనా దాడి చేస్తే అప్పుడు అవి అప్రమత్తమయ్యి శరీరంలో యాంటీ బాడీలను త్వరగా విడుదలయ్యేలా చేస్తాయి. ఈ పరిశోధనలో భాగంగా కరోనా బారిన పడిన వారిని నాలుగవ రోజు నుంచి 242 వ రోజు వరకు పరిశీలించారు.
వైరస్ ను అడ్డుకోవడానికి అవసరమైన యాంటీ బాడీలు 20వ రోజు నుంచీ తగ్గిపోవడం మొదలైనా.. వారి శరీరంలో వైరస్ ను గుర్తుపట్టే బీ సెల్స్ మాత్రం చివరి రోజు వరకు కొనసాగాయని తెలిపారు. ఈ మెమరీ బీ సెల్స్ వైరస్ రెండవ సారి దాడి చేస్తే ఇతర శరీర భాగాలకు అది విస్తరించకుండా అడ్డుకోగలదు. ఈ విధంగా కరోనా నుంచి కోలుకున్న వారికి వైరస్ నుంచి 8 నెలల పాటు రక్షణ లభిస్తుంది. కానీ కరోనా నుంచి కోలుకున్న వారిలో చాలా మంది రెండు, మూడు, ఆరు నెలల్లోపు మళ్ళీ ఆ వైరస్ బారిన పడుతున్నారు కదా వారి మాటేమిటీ అంటే? ఆ విషయాన్నీ కూడా శాస్త్రవేత్తలు వివరించారు. చాలా మందిలో రీ ఇన్ఫెక్షన్ కేసులు చూస్తున్నాం. అంటే రెండవ సారి కరోనా సోకడం. అయితే ఇలాంటి కేసులు చాలా అరుదుగా వస్తాయని.. రెండవసారి కరోనా బారిన పడుతున్న వారు మిలియన్ల మందిలో కొందరేనన్నారు. రెండవసారి కరోనా సోకడానికి చాలానే కారణాలు ఉంటాయి.
వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు, మాత్రమే మళ్ళీ వైరస్ బారిన పడుతున్నారు. అందువల్ల కరోనా నుంచి కోరుకున్న వారు మళ్ళీ వైరస్ సోకుతుందేమోనన్న భయాన్ని వదిలి ధైర్యంగా ఉండవచ్చు అని పేర్కొన్నారు. కరోనా సోకిన వారిలో ధైర్యంగా ఉన్న వారు వైరస్ ను ఎదుర్కోగలిగారు. గర్భిణీ స్త్రీలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారిలో మాత్రం పరిస్థితి కొంత క్లిష్టంగా మారింది. ఈ క్రమంలో కొందరు ప్రాణాలు వదిలారు. అయితే ఎలాంటి సమస్యా లేని వారు మాత్రం భయపడాల్సిన పని లేదు. కానీ కరోనా రాదనే అతి విశ్వాసం ఉండటం మాత్రం ప్రమాదకరంగా మారే అవకాశం ఉందన్నారు. మన వల్ల ఇతరులకు కరోనా సోకితే వారికి అది ప్రాణాంతకంగా మారె అవకాశం ఉంది.