కరోనాను ఎదుర్కొనే బ్రహ్మాస్త్రం వ్యాక్సిన్ మాత్రమేనని నిపుణులు, ప్రభుత్వాలు చెబుతున్నాయి. ప్రజలు కూడా కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, వ్యాక్సిన్‌కు సంబంధించి ఇంకా పలు అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా ఎక్కువ కాలం అది మనకు రక్షణ ఇవ్వదనేది ప్రధానంగా ప్రచారం జరుగుతోంది. కొంత కాలం వరకే వ్యాక్సిన్ కరోనా నుంచి రక్షిస్తుందని ఇప్పటివరకు కొన్ని అంచనాలు ఉన్నాయి.
అయితే, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ – ఆస్ట్రాజెనికా సంస్థలు కలిసి అభివృద్ధి చేసిన కోవీషీల్డ్ వ్యాక్సిన్ మాత్రం జీవితకాలం మనకు కరోనా నుంచి రక్షణ కల్పిస్తుందని తాజాగా ఒక అధ్యయనంలో వెల్లడైంది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మనలో యాంటీబాడీలు వృద్ధి చెందుతాయి. భవిష్యత్‌లో మన శరీరంలోకి కరోనా వైరస్ చేరితే ఈ యాంటీబాడీలు వెంటనే అప్రమత్తమై వైరస్‌ను నాశనం చేస్తాయి. దీంతో కరోనా వైరస్ మన ఆరోగ్యానికి ఎక్కువగా నష్టం చేయకుండా వ్యాక్సిన్ కాపాడుతుంది.
ప్రాణాపాయాన్ని, ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితిని వ్యాక్సిన్ యాంటీబాడీలు తగ్గిస్తాయి. అయితే, యాంటీబాడీలు ఉన్నంతకాలమే మనకు కరోనా నుంచి రక్షణ ఉంటుందనేది ఇప్పటివరకు కొందరు అంచనా వేస్తున్నారు. వ్యాక్సిన్ యాంటీబాడీలు రెండుమూడేళ్ల వరకు మన శరీరంలో ఉంటాయని చెబుతున్నారు. అయితే, యాంటీబాడీలు వెళ్లిపోయినా కూడా మనకు కోవీషీల్డ్ వ్యాక్సిన్ రక్షణ కల్పిస్తుందని యూకే, స్విట్జర్ల్యాండ్కు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కోవీషీల్డ్ వ్యాక్సిన్ మన శరీరంలో కరోనాను గుర్తించి, నాశనం చేసే టీసెల్స్‌ను కూడా తయారుచేస్తాయని ఈ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాబట్టి, వ్యాక్సిన్ వల్ల ఏర్పడే యాంటీబాడీలు కొంతకాలం తర్వాత శరీరంలో లేకపోయినా టీసెల్స్ మాత్రం మనల్ని కరోనా నుంచి జీవితకాలం రక్షిస్తాయని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ మేరకు వీరి నేచర్ అనే జర్నల్‌లో ఒక ఆర్టికల్ రాశారు. యూకేకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ ది సన్ ఈ విషయాన్ని ప్రచురించింది.