బిర్యానీ ప్యాకెట్లలో బంగారపు ముక్కుపుడకలు బయటపడ్డాయి. ముక్కుపుడకలతో మహిళా ఓటర్లకు గాలం వేయాలనుకున్న అభ్యర్థికి పోలీసులు షాకిచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రయత్నించిన ఓ స్వతంత్య్ర అభ్యర్థి ఎవ్వరికీ అనుమానం రాకుండా వినూత్న ప్రయోగం చేసాడు. చివరకు పోలీసుల చేతిలో బుక్కయ్యాడు.
వివరాల్లోకి వెళితే.. నంద్యాలలోని 12 వ వార్డులో ఖండే శ్యామ్ సుందర్ అనే వ్యక్తి స్వతంత్య్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బిర్యానీ ప్యాకెట్లలో ముక్కు పుడకలు ఉంచి మహిళా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించాడు. రంగంలోకి దిగిన పోలీసులు వారి దగ్గర నుంచి రూ. 55 వేల నగదు, 23 బంగారపు ముక్కు పుడకలను స్వాధీనం చేసుకున్నారు. వీరంతా కర్ణాటకకు చెందిన వారిగా గుర్తించారు. కాగా ఈ ఘటనలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు శ్యామ్ సుందర్ పై ఎన్నికల నియమావళి అతిక్రమణ కింద కేసులు నమోదు చేసారు.