జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ తెరాసకు తన మద్దతును ప్రకటించింది. దీంతో హైదరాబాద్ మేయర్, డెప్యూటీ మేయర్ పదవుల తెరాస పార్టీనే వరించాయి. ఎక్స్ అఫిషియో ఓట్లతో సంబంధం లేకుండానే మేయర్ ఎన్నిక జరిగింది. హైదరాబాద్ జీహెచ్ఎంసీ మేయర్ గా బంజారాహిల్స్ కార్పొరేటర్, రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు కుమార్తె గద్వాల విజయ లక్ష్మి ఎన్నికయ్యారు.
డెప్యూటీ మేయర్ గా తార్నాక కార్పొరేటర్ మోతె శ్రీలత ఎన్నికయ్యారు. బీజేపీ తరపున ఆర్కేపురం డివిజన్ నుంచి రాధా ధీరజ్ రెడ్డి నామినేషన్ వేశారు. ఎన్నికల అధికారి కలెక్టర్ శ్వేతా మహంతి వోటింగ్ ను నిర్వహించారు. అనంతరం గద్వాల విజయ లక్ష్మి మేయర్ గా ఎన్నికైనట్టుగా ఆమె ప్రకటించారు.
విజయ లక్ష్మి ఎల్ఎల్బీ, జర్నలిజం అభ్యసించారు. అమెరికాలో 18 సంవత్సరాల పాటు ఉన్న ఆమె ఆ తర్వాత 2007లో అమెరికా పౌరసత్వం వదులుకుని ఇండియాకు తిరిగివచ్చారు. అనంతరం రెండు సార్లు బంజారాహిల్స్ కార్పొరేటర్ గా పోటీ చేసి విజయం సాధించారు.