హైద్రాబాద్ లోని ఘట్కేసర్ ఫార్మసీ విద్యార్థిని కేసులో విషాదం చోటుచేసుకుంది. తనపై ఆటో డ్రైవర్లు అత్యాచారం చేసారంటూ పోలీసులను తప్పుదోవ పట్టించిన యువతి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచింది. ఇంట్లో ఉన్న షుగర్ మాత్రలను మింగి యువతి ఆత్మహత్యకు పాల్పడినట్టుగా సమాచారం. ఈ ఘటన అనంతరం యువతి తన అమ్మమ్మ ఇంట్లో ఉంటుంది. ఈ కేసులో ఆటో డ్రైవర్ల తప్పు లేదని నిర్దారించిన పోలీసులు యువతిపై కేసులు నమోదు చేసారు. కొద్ది రోజులుగా ఆరోగ్యం బాగాలేకపోవడంతో పాటు తాను చేసిన పనికి ఆమె పశ్చాత్తాపానికి గురైనట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు సంబందించిన మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
కాగా రాంపల్లి ఆర్ఎల్ నగర్ కు చెందిన ఫార్మసీ విద్యార్థిని ఈ నెల 10వ తేదీన కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వచ్చే క్రమంలో తన తల్లికి ఫోన్ చేసి తనను ఆటో డ్రైవర్లు కిడ్నాప్ చేసారంటూ సమాచారం అందించింది. వారు 100 కు డయల్ చేసి సమాచారం ఇవ్వగా పోలీసులు రంగంలోకి దిగారు. మొదట యువతి మాటలు నిజమేనని నమ్మి ఆమెను ఆసుపత్రికి తరలించారు. కాగా సీన్ రీ కంస్ట్రక్షన్ సమయంలో ఆ యువతి చెప్పినదంతా కట్టుకథగా తేలింది.