సొంతూరులో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే గంగవ్వ ‘మై విలేజ్ షో’ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ ఛానెల్ ద్వారా లభించిన గుర్తింపు ద్వారా ఆమె బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. గంగవ్వ తెలంగాణ యాసకు, ఆమె మాట తీరుకు తెలుగు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు.
దీంతో ఆమెకు లక్షలాది మంది అభిమానులు ఏర్పడ్డారు. కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా బిగ్ బాస్ షో నుంచి మధ్య లో నుంచే తప్పుకుంది గంగవ్వ. తాజాగా గంగవ్వ తాను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా వెల్లడించింది. దేంతో గంగవ్వకు ఏమైందోనని ఆమె అభిమానులంతా ఆందోళనకు గురయ్యారు.
అయితే గంగవ్వ ఓ ఫోటోను పోస్ట్ చేస్తూ తాను ఆసుపత్రిలో చేరానని, మోకాళ్ళ నొప్పులకు సంబందించిన చికిత్స తీసుకుంటున్నానాని చెప్పి క్లారిటీ ఇవ్వడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. కొంతకాలంగా కాళ్ళ నొప్పులతో బాధపడుతున్న గంగవ్వ ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నట్టుగా పేర్కొన్నారు. కాగా బిగ్ బాస్ లో పాల్గొనడం ద్వారా వచ్చిన డబ్బుతో గంగవ్వ సొంతింటిని కట్టుకుంటున్న విషయం తెలిసిందే.