logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

బాబాయి చెప్పిన 6 సూత్రాలే జి.పుల్లారెడ్డిని అంత గొప్ప వ్యాపార‌వేత్త‌ను చేశాయి

వారెన్ బ‌ఫెట్‌ను మ‌న‌మంతా ఆద‌ర్శంగా తీసుకుంటాం. ధీరూభాయ్ అంబానీ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుంటాం. వీరు చిన్న స్థాయి నుంచి వ్యాపారంలో ఎంతో ఎత్తుకు ఎద‌గ‌డమే ఇందుకు కార‌ణం. అయితే, వీరిలానే త‌న క‌ష్టాన్ని, వ్యాపార తెలివితేట‌ల‌ను, నిజాయితీని న‌మ్మి వ్యాపార‌వేత్త‌గా ఎదిగిన మ‌న తెలుగు వ్య‌క్తి గుణంప‌ల్లి పుల్లారెడ్డి. మ‌న‌లో చాలామంది జి.పుల్లారెడ్డి స్వీట్స్‌ను రుచి చూసి ఉంటాం. ఈ స్వీట్ ఎంత రుచిగా ఉంటుందో అంత‌కంటే గొప్ప వ్య‌క్తం జి.పుల్లారెడ్డి. ఒక మామూలు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగిన జి.పుల్లారెడ్డి గురించి వ్యాపారిగానే కాదు ఆయ‌న దాతృత్వం గురించి, ఆయ‌న న‌మ్మిన వ్యాపార సూత్రాల గురించి, ల‌క్ష‌లాది మందికి విద్యను అందించిన గొప్ప‌దనం గురించి తెలుసుకోవాలి. ఇవాళ పుల్లారెడ్డి వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌న జీవితంపై ప్ర‌త్యేక క‌థ‌నం మీకోసం…

1920 ఆగ‌స్టు 12న క‌ర్నూలు జిల్లా గోక‌వ‌రం అనే గ్రామంలో పుల్లారెడ్డి జ‌న్మించారు. చిన్న‌త‌నంలో చ‌దువుపైన ఆయ‌న‌కు పెద్దగా ఆస‌క్తి లేక‌పోవ‌డంతో ఐదో త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దివి ఆపేశారు. దీంతో ఆయ‌న‌ను త‌న‌తో పాటు క‌ర్నూలు ప‌ట్ట‌ణానికి తీసుకెళ్లారు పుల్లారెడ్డి బాబాయ్ క‌సిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి. మొద‌ట ఆయ‌న వ‌ద్ద‌నే పుల్లారెడ్డి ప‌నికి కుదిరారు. ఈ స‌మ‌యంలోనే నారాయ‌ణ‌మ్మ‌తో ఆయ‌న వివాహం జ‌రిగింది.

వ్యాపారం చేయాల‌నేది పుల్లారెడ్డి కోరిక‌. దీంతో 25 రూపాయ‌లు అప్పు చేసి క‌ర్నూలులో టీ వ్యాపారం మొద‌లుపెట్టారు. క‌ర్నూలు వీధుల్లో తిరుగుతూ టీ అమ్మేవారు. త‌ర్వాత దుస్తుల వ్యాపారం వైపు ఆయ‌న దృష్టి మ‌ళ్లింది. ఊరూరు తిరిగి దుస్తులు అమ్మ‌డి ప్రారంభించారు. ఈ రెండు వ్యాపార‌లూ ఆయ‌న‌కు ఎంతోకొంత క‌లిసోచ్చాయి. కానీ, వ్యాపారాన్ని విస్త‌రించాల‌నే కోరిక‌తో మ‌రో వ్య‌క్తితో క‌లిసి రెడిమేడ్ దుస్తుల వ్యాపారం మొద‌లుపెట్టారు పుల్లారెడ్డి. ఈసారి ఆయ‌న విఫ‌ల‌మ‌య్యారు. వ్యాపారంలో న‌ష్టాలొచ్చాయి.

అయితే, ఓట‌మి గెలుపుకు పునాది అని పుల్లారెడ్డి న‌మ్మారు. మ‌ళ్లీ వ్యాపారంలోనే నిల‌దొక్కుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. మ‌రోసారి పుల్లారెడ్డికి ఆయ‌న బాబాయి చేయూత‌నిచ్చారు. 1948లో క‌ర్నూలులో మిఠాయి అంగ‌డి పెట్టించారు. ఈ స‌మ‌యంలో వ్యాపారంలో అవ‌లంభించాల్సిన సూత్రాల‌ను పుల్లారెడ్డికి ఆయ‌న బాబాయ్ హిత‌బోధ చేశారు. ఇవి ఇప్ప‌టికీ పుల్లారెడ్డి సంస్థ‌లు ఆచ‌రిస్తున్నాయి. నిజానికి అంద‌రూ ఆచ‌రించాల్సిన గొప్ప సూత్రాల‌వి.

1.నీవు తినేదే నీ పనివాళ్ల‌కు పెట్టు.
2.వ్యాపారానికి కావలసిన ముడిసరుకులు నీవే కొని తెచ్చుకో. ఇతరులను పంపించకు.
3.మిఠాయి చేసిన తరువాత రుచి చూసి బాగుంటేనే అమ్ము బాగాలేకపోతే అమ్మకు.
4.ధనికుడికైనా దరిద్రుడికైనా ఒకటే ధరకు అమ్ము.
5.తూకంలో ఒక తులం ఎక్కువైనా పరవాలేదు కాని తక్కువ కాకుండా చూసుకో.
6.పాకశుద్ధి ఎంత అవసరమో వాక్శుద్ధి కుడా అంతే అవసరం కనుక అబద్దం ఆడకు.

ఈ సూత్రాల‌ను వ్యాపారంలో పుల్లారెడ్డి అనుక్ష‌ణం గుర్తుపెట్టుకున్నారు. మిఠాయి దుకాణం ప్రారంభించాక మొద‌ట్లో పుల్లారెడ్డి కొన్ని ఇబ్బందులు ఎదుర‌య్యాయి. స్వీట్లు త‌యారు చేయ‌డానికి ఓ మ‌నిషిని పెట్టుకుంటే, ఆయ‌న చేసిన స్వీట్లు పుల్లారెడ్డికి సంతృప్తి ఇవ్వ‌లేదు. దీంతో నాలుగు నెల‌ల పాటు క‌ష్ట‌ప‌డి త‌నే స్వ‌యంగా స్వీట్లు చేయ‌డం నేర్చుకున్నారు. అయితే, నాణ్య‌మైన‌, రుచిక‌ర‌మైన స్వీట్లు అందించాల‌నే భావ‌న‌తో స్వీట్ల త‌యారీకి వాడే ముడిస‌రుకులు కూడా నాణ్య‌మైన‌వి వాడేవారు.

దీంతో మిగ‌తా స్వీట్ షాప్‌ల కంటే పుల్లారెడ్డి ద‌గ్గ‌ర ధ‌ర‌లు ఎక్కువ‌గా ఉండేవి. మొద‌ట్లో కొనుగోలుదారుల‌ను ఒప్పించ‌డం ఆయ‌న‌కు క‌ష్ట‌మ‌య్యేది. కానీ, ఒక‌సారి పుల్లారెడ్డి ద‌గ్గ‌ర మిఠాయి రుచి చూశాక మ‌ళ్లీ మ‌ళ్లీ రావ‌డం ప్రారంభించారు. ఆ స‌మ‌యంలో ఆంధ్ర రాష్ట్రానికి క‌ర్నూలు రాజ‌ధానిగా ఉండేది. దీంతో స్వ‌ల్ప‌కాలంలోనే పుల్లారెడ్డి రాజ్‌భ‌వ‌న్‌కు కూడా స్వీట్లు స‌ర‌ఫ‌రా చేసే స్థాయికి చేరుకున్నారు.

త‌ర్వాత రాజ‌ధాని క‌ర్నూలు నుంచి హైద‌రాబాద్‌కు మార‌డంతో హైద‌రాబాద్‌లోనూ స్వీట్ షాప్ పెట్టాల‌ని ఆయ‌న నిర్ణ‌యించారు. 1957లో ఆబిడ్స్ స్టేష‌న్ రోడ్డులో స్వీట్ షాప్ ప్రారంభించారు. అప్ప‌ట్లో న‌గ‌రంలో కేవ‌లం ముస్లింలు, ఉత్త‌రాధి వారి స్వీట్ షాపులే ఉండేవి. హైద‌రాబాద్‌లో తెలుగువారు పెట్టిన మొద‌టి స్వీట్ షాపు పుల్లారెడ్డిదే. హైద‌రాబాద్‌లోనూ ఆయ‌న స్వీట్ల‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. దీంతో క్ర‌మంగా ఆయ‌న కొత్త దుకాణాలు ప్రారంభిస్తూ వెళ్లారు. రుచి, నాణ్య‌త‌, ప‌రిశుభ్ర‌త‌కు పెద్ద‌పీట వేస్తూ త‌న వ్యాపారాన్ని విస్త‌రించుకున్నారు.

స‌రిగ్గా 50 ఏళ్ల వ‌య‌స్సు వ‌చ్చాక స‌మాజం కోసం ఏదైనా చేయాల‌నే త‌ప‌న ఆయ‌న‌లొ మొద‌లైంది. జి.పుల్లారెడ్డి ఛారిట‌బుల్ ట్ర‌స్ట్ ఏర్పాటు చేశారు. జి.పుల్లారెడ్డి, త‌న భార్య జి.నారాయ‌ణ‌మ్మ పేర్ల మీద అనేక విద్యాసంస్థ‌ల‌ను ప్రారంభించారు. తాను పుట్టి పెరిగిన క‌ర్నూలు జిల్లాలో ఎన్నో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను త‌న స్వంత డ‌బ్బుల‌తో అభివృద్ధి చేశారు. అనాథ పిల్ల‌ల‌కు విద్యనందించేందుకు విజ్ఞాన పీఠం అనే ఆశ్ర‌మాన్ని ప్రారంభించి వారికి చ‌దువు, వ‌స‌తి క‌ల్పించారు.

హిందుత్వ భావ‌జాలంపైన జి.పుల్లారెడ్డికి ముందు నుంచీ మ‌క్కువ‌. ఈ క్ర‌మంలోనే ఆయ‌న రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్‌(ఆర్ఎస్ఎస్) వైపు మొగ్గు చూపారు. 1974లో ఆర్ఎస్ఎస్‌లో స‌ర్ సంఘ్ ఛాల‌క్ అయ్యారు. విశ్వ హిందూ ప‌రిష‌త్‌తో ఆయ‌న‌కు చాలా అనుబంధం ఉంది. 1980లో పుల్లారెడ్డి విశ్వ హిందూ ప‌రిష‌త్‌(వీహెచ్‌పీ)కి హైద‌రాబాద్ శాఖ అధ్య‌క్షుడ‌య్యారు. త‌ర్వాత భాగ్య‌న‌గ‌ర గ‌ణేష్ ఉత్స‌వ స‌మితికి సుదీర్ఘ‌కాలం అధ్య‌క్షుడిగా ప‌నిచేశారు. అనేక హిందూ ఆల‌యాల అభివృద్ధికి పుల్లారెడ్డి విరాళాలు ఇచ్చేవారు.

పుల్లారెడ్డి సేవ‌లు మెచ్చి ప్ర‌ఖ్యాత ఉడుపి పెజావ‌ర్ పీటం దాన‌గుణ భూష‌ణ బిరుదు ప్ర‌దానం చేసింది. 1992లో జ‌మ్నాలాల్ బ‌జాజ్ పుర‌స్కారం కూడా పుల్లారెడ్డికి ద‌క్కింది. 2007లో మార్చ్ 7న పుల్లారెడ్డి తుదిశ్వాస విడిచారు. పుల్లారెడ్డి ఈ భూమి మీద లేక‌పోయినా ఆయ‌న ఆద‌ర్శాలు, స్ఫూర్తి కొన‌సాగుతోంది. ఆయ‌న వార‌సులు జి.పుల్లారెడ్డి స్వీట్స్‌ను మ‌రింత విస్త‌రిస్తున్నారు. ఛారిట‌బుల్ ట్ర‌స్ట్ సేవ‌లు మ‌రింత విస్తృత‌ప‌రిచారు. పుల్లారెడ్డి కుమారుడు జి.రాఘ‌వ‌రెడ్డి ప్ర‌స్తుతం విశ్వ హిందూ ప‌రిష‌త్ అంత‌ర్జాతీయ అధ్య‌క్షుడిగా కొన‌సాగుతున్నారు. కొత్తగా వ్యాపార‌రంగంలోకి అడుగుపెట్టాల‌నుకునే వారిని జి.పుల్లారెడ్డి జీవితం ఒక మార్గ‌ద‌ర్శిగా ఉంటుంది.

Related News