మనమంతా క్రమం తప్పకుండా పెట్రోల్ బంకుల్లోకి వెళ్లి మన వాహనాల్లో పెట్రోల్, డీజిల్ పోయించుకుంటాం. పెట్రోల్ బంక్ అంటే కేవలం పెట్రోల్, డీజిల్ దొరికే స్థలంగానే మనమంతా భావిస్తాం. డబ్బులు ఇచ్చామా, పెట్రోల్ కొట్టించుకున్నామా అనే వరకే మనం ఆలోచిస్తాం. కానీ, పెట్రోల్ బంకులో మనకంటూ కొన్ని సదుపాయాలు ఉంటాయి. వీటిపై మనలో చాలా మందికి అవగాహన లేక మనము ఉపయోగించుకోవడం లేదు.
పెట్రోల్ బంకులో పెట్రోల్ లేదా డీజిల్ క్వాలిటీని పరీక్షించే హక్కు మనందరికీ ఉంటుంది. ఇందుకు గానూ పెట్రోల్ టెస్టు చేయడానికి ఫిల్టర్ పేపర్ టెస్టు ఉంటుంది. ఫిల్టర్ పేపర్‌పైన రెండు చుక్కల పెట్రోల్ వేసి రెండు నిమిషాలు ఆగితే పెట్రోల్ చుక్కలు ఆవిరయ్యి అక్కడ పింక్ కలర్ ఏర్పడాలి. అలా పింక్ కలర్ వస్తే పెట్రోల్ నాణ్యమైనది అన్నట్లు. ఒకవేళ పింక్ కలర్ కాకుండా వేరే కలర్స్ వచ్చినా, ఏమీ రాకపోయిన పెట్రోల్ కల్తీ అయ్యిందనో, నాణ్యంగా లేదనో లెక్క. ఈ టెస్టు చేయడానికి కావాల్సిన ఫిల్టర్ పేపర్ కూడా పెట్రోల్ బంకు నిర్వాహకుల వద్ద ఉచితంగా తీసుకొవచ్చు.
కేవలం క్వాలిటీనే కాదు క్వాంటిటీని కూడా పెట్రోల్ బంకుల్లో పరీక్షించుకునే హక్కు మనకు ఉంటుంది. ఇందుకు గానూ పెట్రోల్ బంకుల్లో 5 లీటర్ల కొలత తప్పనిసరిగా ఉండాలి. దీనితో పెట్రోల్ కొలిచినప్పుడు ఒకవేళ 25 ఎంఎల్ కంటే ఎక్కవ తేడా ఉంటే పెట్రోల్ బంక్‌పై ఫిర్యాదు చేయవచ్చు. సదరు పెట్రోల్ బంకుపై కేసు కూడా నమోదు చేసే అవకాశం ఉంటుంది.
మనలో చాలా మందికి తెలియవు కానీ పెట్రోల్ బంకులో చాలా ఉచిత సేవలు పొందవచ్చు. మన వాహనాలకు ఉచితంగా టైర్లలో గాలి కొట్టించుకోవచ్చు. ఇందుకు ఎటువంటి డబ్బులు తీసుకోకుడదు. ఉచితంగా త్రాగునీరు తాగవచ్చు. ఉచితంగా టాయ్‌లెట్ వినియోగించుకోవచ్చు. పెట్రోల్ బంకులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అందుబాటులో ఉండాలి. దీనిని ఎవరైనా ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.
పెట్రోల్ బంకుల నిర్వాహకులు కచ్చితంగా బంకులో కంప్లైంట్ బాక్స్ లేదా కంప్లైంట్ రిజిస్టర్ అందుబాటులో ఉంచాలి. అగ్నిమాపక పరికరాలు కూడా తప్పనిసరిగా ఉండాలి. పెట్రో ధరలతో పాటు పని వేళలు అందరికీ కనిపించేలా ప్రదర్శించాలి. పెట్రోల్ బంకు మేనేజర్ ఫోన్ నెంబరు కూడా అందరికీ కనిపించేలా రాసి పెట్టాలి.