మంగళవారం రైతులతో భేటీ అయిన కేంద్ర మంత్రి అమిత్ షా వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం కుదరదని తేల్చి చెప్పారు. రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా సవరణలు చేసే వీలుందని వివరించారు. అయితే అమిత్ షా ప్రతిపాదనకు స్పందించిన రైతులు రైతు సంఘాలకు ఆ సవరణలను పంపాలని తెలుపగా ఈరోజు ప్రభుత్వం వ్యవసాయ చట్టాలపై రాతపూర్వక ప్రతిపాదనలను రైతు సంఘాలకు పంపింది.
వీటిలో పలు కీలక విషయాలను ప్రస్తావించింది. కాగా ఈ ప్రతిపాదనలపై స్పందించిన రైతు సంఘాలు కేంద్రానికి షాకిచ్చాయి. చట్టాల్లో సవరణలకు కేంద్రం ప్రతిపాదనలు ఆమోదించేదే లేదని స్పష్టం చేసారు. ఈరోజు మరోసారి రైతు సంఘాలన్నీ కేంద్రం ప్రతిపాదనలపై చర్చింది ఒక నిర్ణయానికి రానున్నాయి. కేంద్రం తీరును బట్టి తమ తదుపరి కార్యాచరణ ఉంటుందని అవసరమైతే ఆందోళనను ముందుకు తీసుకువెళతామని వెల్లడించారు.
కాగా కేంద్రం సవరించడానికి సిద్ధంగా ఉన్న అంశాల్లో.. ఏపీఎంసీలపై రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా చట్టాల్లో మార్పులు చేస్తామని పేర్కొంది. ఏపీఎంసీలలో ఒకే ట్యాక్స్ సవరణకు సానుకూలంగా కేంద్రం సానుకూలంగా స్పందించింది. ప్రైవేటు కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తామని తెలిపింది. ప్రభుత్వం కూడా పంట సేకరణ చేసేలా సవరణ చేస్తామని పేర్కొంది.
రైతులు- వ్యాపారుల ఒప్పందంలో వివాదాలు తలెత్తితే ఎస్డీఎం అధికారులు కల్పించుకుని పరిష్కరించేలా సవరణలు, కాంట్రాక్ట్ ఫార్మింగ్ వ్యవసాయంలో రైతుల భూముల రక్షణకు హామీ ఇస్తామని ఈ ఒప్పందాలలో వివాదాలు తలెత్తితే సివిల్ కోర్టును ఆశ్రయించే వీలు కల్పిస్తామని కనీస మద్దతు ధరపై రాతపూర్వక హామీ ఇస్తామని కేంద్రం తెలిపింది. అదే విధంగా పంట వ్యర్థాల దహనం అంశం పై కూడా రాతపూర్వక హామీ కి కేంద్ర అంగీకారం తెలిపింది.