దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకు విజృుంభిస్తోంది. ప్రతిరోజు దేశంలో దాదాపు 80 వేలకి పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్-19 బారిన పడకుండా మాస్క్ ధరించడం, తరచూ శానిటైజర్లతో చేతులను శుభ్రం చేసుకోవడం ఎంత ముఖ్యమో.. స్వీయ జాగ్రత్తలు తీసుకుంటూనే రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు సరైన పౌష్ఠికాహారం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ నేపథ్యంలో కరోనా సమయంలో ఏం తినాలి, ఏం తినొద్దు వంటి వివరాలను ఆంధ్రప్రదేశ్ కోవిడ్ – 19 స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్ చెబుతున్నారు.
శాఖాహారంలో తినాల్సినవి ఏంటంటే.. బ్రౌన్ రైస్, గోధుమ పిండి, ఓట్స్ మరియు చిరుధాన్యాలు తినడం మంచిది. బీన్స్, చిక్కుడు, పప్పు ధాన్యాలు తినడం ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అందుతాయి. ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. కూరగాయల్లో కాప్సికమ్, క్యారెట్, బీట్ రూట్, వంకాయ వంటివి తినడం ఇంకా మంచిది. రోజులో కనీసం రెండు లీటర్ల గోరు వెచ్చని నీటిని తాగేందుకు ప్రయత్నించాలి.
నిమ్మపండు, బత్తాయిలో వ్యాధి నిరోధక శక్తిని కలుగజేసే సి విటమిన్ ఉంటుంది. కాబట్టి ఇవి తీసుకోవడం కరోనాను ఎదుర్కోవడంలో ఉపయోగపడుతుంది. ఆహారంలో మసాలా ద్రవ్యాలైన అల్లం, వెల్లుల్లి, పసుపు మొదలగు వాటిని చేర్చండి. ఇవి వ్యాధి నిరోధక శక్తి యొక్క సహజత్వాన్ని పెంపొందిస్తాయి. ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తింటూ బయటి ఆహారానికి దూరంగా ఉండటం మంచిది. కొవ్వు పదార్థాలు మరియు నూనెలను తక్కువగా వాడాలి. పండ్లు, కూరగాయలు తినడానికి ముందు శుభ్రంగా కడగడం మర్చిపోవద్దు. వెన్న తీసిన పాలు, పెరుగును తీసుకోవాలి. వీటిలో ప్రోటీన్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది.
శాఖాహారంలో కొన్ని తినకపోవడం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంచిది. మైదా పిండితో తయారుచేసినవి, వేయించిన ఆహారం, చిప్స్, కుక్కీస్ వంటి జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. శీతల పానీయాలు, ప్యాక్ట్ జ్యూస్ కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగడం మంచిది కాదు.. వీటిలో పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. చీజ్, కొబ్బరి, పామాయిల్, బటర్ తినకండి. వీటిలో అనారోగ్యాన్ని కలిగించే కొవ్వు పదార్థాలు ఉంటాయి.
మాంసాహారం విషయానికి వస్తే… స్కిన్ చికెన్, చేపలు మరియు గుడ్డు తెల్లసొన మొదలగు వాటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది వీటిని తీసుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వండి. అయితే, శుభ్రమైన, తాజా మాంసాహారం మాత్రమే తినాలి.
మాంసాహారంలో లివర్, వేయించిన మాంసానికి దూరంగా ఉండండి. వారంలో రెండు నుంచి మూడు రోజులు మాత్రమే మాంసాహారాన్ని తీసుకోవాలి. పచ్చసోనతో కలిపి ఉండే పూర్తి గ్రుడ్డుని వారంలో ఒక్కసారి మాత్రమే తినాలి.