logo

  BREAKING NEWS

బ్రేకింగ్: పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. జ‌గ‌న్‌కు భారీ షాక్‌  |   వ్యాక్సిన్ అంద‌రూ తీసుకోవాలా ? క‌రోనా వ‌చ్చి త‌గ్గిన వారూ తీసుకోవాలా ?  |   గుర‌క పెడుతున్నారా..? ఈ చిట్కా పాటిస్తే జీవితంలో గుర‌క పెట్ట‌రు  |   వ‌కీల్ సాబ్ మ‌రో రికార్డు.. షూటింగ్ కాక‌ముందే రూ.15 కోట్లు వ‌చ్చేశాయి  |   తెలంగాణ కొత్త‌గా ఆరు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్క‌‌డో తెలుసా ?  |   ‘మా సినిమా డైలాగులే కాపీ కొడతారా?’.. దేవినేనికి కొడాలినాని కౌంటర్  |   ముఖ్య‌మంత్రి మార్పు ఉండొచ్చు.. ఈటెల సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు  |   భూమా అఖిలప్రియ అరెస్టుపై కొడాలినాని సంచలన వ్యాఖ్యలు!  |   సీఎం జగన్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన.. మతలబేంటి?  |   ”జీవితకాలం శిక్షపడే కేసులు స్వీకరించం”.. అఖిలప్రియకు కోర్టు భారీ షాక్!  |  

చేపలు తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

మీకు చేపల కూర అంటే ఇష్టమా.. వీకెండ్ వస్తే చేపలు తినాల్సిందేనా? అయితే మీకో శుభవార్త! చేపలు ఆరోగ్యానికి మంచిదేనా కదా అనేది చాలా మందిలో తలెత్తే అనుమానం. అయితే తాజా పరోశోధనలో కొన్ని ఆసక్తికర విషయాలు తేలాయి. చేపల రుచిని ఆస్వాదించేవారు వాటి వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా తెలుసుకోండి.

భారతీయుల్లో ప్రాచీన కాలం నుంచి ఓ నమ్మకం ఉంది. సముద్ర తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు మిగిలిన వారి కన్నా అత్యంత తెలివైన వారుగా ఉంటారని. మిగిలిన వారితో పోలిస్తే వారు ఎంతో ఆరోగ్య వంతులుగా జీవిస్తారని అలాగే వారి చర్మం ఎంతో నునుపుగా, కాంతివంతంగా ఉంటుందని నమ్ముతారు. వారు ఆహారంలో అధికభాగం చేపలను తినడం వల్లనే ఇది సాధ్యమని అంటుంటారు. ఇవన్నీ అపోహలుగా కొందరు వాదిస్తున్నా చేపల్లో ఎన్నో విలువైన పోషకాలు ఉన్నాయని కొన్ని శాస్త్రీయ పరిశోధనల్లో కూడా రుజువైంది.

అమెరికన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీలో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. చేపలను తరచుగా తినే వారికి గుండె జబ్బులు దరిచేరవు. వీటి వల్ల గుండె వ్యాధులను గణనీయంగా తగ్గించవచ్చని సూచిస్తున్నారు. చేపల్లో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు శరీరంలోని ట్రైగ్లిజరైడ్లను తగ్గించడం ద్వారా మీ గుండెను ఆరోగ్యంగా ఉంచగలవని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అంతేకాకుండా రక్తం గడ్డకట్టడాన్ని తగ్గించి, క్రమంగా రక్తపోటును కూడా తగ్గించే అవకాశం ఉన్నట్లుగా చెప్పబడుతుంది.

వీటిలో ప్రోటీన్, విటమిన్ డి, కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ముఖ్యమైన పోషకాలతో పాటుగా ఇనుము, జింక్, అయోడిన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు కూడా చేపల ద్వారా లభిస్తాయి. ఇవన్నీ శరీరానికి ఎంతో అవసరమైన పోషకాలు. చేపలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అధిక బరువు, పొట్ట చుట్టూ ఉండే కొవ్వు తగ్గి నాజూకుగా మారతారు. అంతేకాకుండా కాలేయం, మెదడు మొదలైన ఇతర అవయవాల పనితీరు మెరుగుపరుస్తుంది. నిద్ర లేమి సమస్యతో బాధపడేవారు చేపలను అధికంగా తినాలని వైద్యులు సూచిస్తారు.

చేపలు కంటి చూపుకు ఎంతో మేలు చేస్తాయన్న విషయం తెలిసిందే. కళ్ళ కండరాలకు, నరాలకు పోషణ ఇచ్చి క్రమంగా కంటి చూపును కూడా మెరుగుపరుస్తాయి. అంతే కాకుండా వృద్ధాప్యంలో చాలా మంది వేధించే సమస్య అల్జీమర్స్. మెదడు పనితీరు మందగించడంతో చిన్న చిన్న విషయాలను కూడా మర్చిపోతుంటారు. చేపలను ఎక్కువగా తినే వారు మాత్రం వృద్ధాప్యంలో ఈ సమస్య బారిన పడకుండా జీవించవచ్చు. చేపల్లో ఉండే విటమిన్ ఇ ఆర్థరైటిస్ రాకుండా చేస్తుంది.

మానవ శరీరం నిత్యం వివిధ రకాల క్యాన్సర్లతో పోరాడుతుంది. అందులో నోరు, గొంతు, చర్మ క్యాన్సర్ వంటి మాత్రం ప్రాణాంతకంగా మారుతుంటాయి. చేపల్లో ఉండే ప్రత్యేక గుణం క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది అని పరిశోధనల్లో వెల్లడైంది. చేపల్లో ఉండే విటమిన్ డి రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా గ్లూకోజ్ స్థాయిలను అదుపు చేసి టైపు 1 డయాబెటిస్ బారిన పడకుండా చేస్తాయి. రుతుక్రమం సమస్యలతో బాధపడే స్త్రీలు తరచుగా ఆహారంలో చేపలను తీసుకోవాలి. జుట్టు ఒత్తుగా పెరగాలన్నా, చర్మం కాంతివంతంగా మారాలన్నా వారంలో రెండు సార్లు చేపలను తినడం మంచిది.

చేపల్లో చాలా రకాలు ఉంటాయి. అయితే, మీరు ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే మాకరెల్, సాల్మన్, హెర్రింగ్, లేక్ ట్రౌట్, సార్డిన్స్, అల్బాకోర్ ట్యూనా రకానికి చెందిన చేపలను తీసుకుంటే మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. అలాగే.. వారంలో కనీసం రెండుసార్లు చేపలను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందట. లేదా వారానికి కనీసం 100 గ్రాముల వరకు ఉడకబెట్టిన, లేదా వేయించిన చేపలను తినడం ఉత్తమం.

Related News