తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తేవాలని కంకణం కట్టుకున్నారు. ఎంతో మంది సీనియర్లను కాదని రేవంత్ రెడ్డికి పార్టీ పగ్గాలు ఇచ్చిన కాంగ్రెస్ అధిష్ఠానం కూడా ఆయనపై చాలా ఆశలే పెట్టుకుంది. ఇక, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు కూడా రేవంత్ రెడ్డి రాకతో తమ పార్టీకి మళ్లీ మంచి రోజులు వస్తాయని బలంగా నమ్ముతున్నారు.
ఇంతలా రేవంత్ రెడ్డిపై అందరూ ఆశలు పెట్టుకుంటే ఆయన స్వంత ఇలాఖాలోనే రేవంత్‌కు గట్టి షాక్ ఇచ్చారు కొందరు కాంగ్రెస్ నేతలు. మున్సిపల్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేదు. కొన్ని మున్సిపాలిటీల్లో మాత్రం పలువురు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు.
వీరు ఇప్పుడు రేవంత్ రెడ్డికి షాకిస్తూ.. టీఆర్ఎస్ పార్టీలో చేరిపోతున్నారు. తాజాగా జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్, తూంకుంట, ఘట్కేసర్ మున్సిపాలిటీలకు చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, పలు గ్రామాల కొందరు ఎంపీటీసీలు మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పేసుకున్నారు. జవహర్‌నగర్ కార్పొరేషన్లో 28 సీట్లు ఉంటే కాంగ్రెస్ కేవలం నాలుగు సీట్లు మాత్రమే గెలిచింది. ఈ నలుగురు కార్పొరేటర్లు ఇప్పుడు టీఆర్ఎస్లో చేరిపోయారు.
మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని వివిధ మండలాలకు చెందిన ఎంపీటీసీలు కూడా కారెక్కారు. గతంలోనే ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి గెలిచిన కాంగ్రెస్ కార్పొరేటర్లు టీఆర్ఎస్లో చేరిపోయారు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత టీఆర్ఎస్లో విలీనమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రాళ్లతో కొడతానని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. వారిపైన ఆయన యుద్ధం ప్రకటించారు.
పార్టీ మారిన వారిపై పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి ఇంత పెద్ద హెచ్చరికలు జారీ చేసినా కూడా పార్టీ ఫిరాయింపులను మాత్రం ఆయన ఆపలేకపోతున్నారు. తాజాగా తన నియోజకవర్గం పరిధిలోని కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు టీఆర్ఎస్లో చేరడమే ఇందుకు ఉదాహరణ. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేసినా వాళ్లు పార్టీలో ఉండరనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. ఇప్పటికైనా ఫిరాయింపులు ఆపి కాంగ్రెస్ వాళ్లు పార్టీ మారరని ప్రజల్లో నమ్మకం కల్పించాల్సిన బాధ్యత రేవంత్‌పై ఉంది. ఈ దిశగా ఆయన ముందు తన నియోజకవర్గంపైనే దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది.