కరోనా వైరస్‌తో పోరాడిన గెలిచిన కొందరికి కొత్త అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే కరోనా నుంచి కోలుకున్న పలువురు బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారు. బ్లాక్ ఫంగస్ కేసులు అన్ని రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి. వైట్ ఫంగస్, యెల్లో ఫంగస్ కేసులు కూడా అక్కడక్కడ నమోదయ్యాయి. ఇప్పుడు తాజాగా ఒక గ్రీన్ ఫంగస్ కేసును వైద్యులు గుర్తించారు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో రెండు నెలల క్రితం కరోనా బారిన పడి కోలుకున్న 34 ఏళ్ల ఒక వ్యక్తికి గ్రీన్ ఫంగస్ బారిన పడ్డాడు. తీవ్ర అనారోగ్య సమస్యలు రావడంతో అతడి బ్లాక్ ఫంగస్ సోకిందని అనుమానించి ఆసుపత్రిలో చేరాడు. ఆసుపత్రిలో వైద్యులు అతడికి గ్రీన్ ఫంగస్ సోకిందని గుర్తించారు. ఎయిర్ ఆంబులెన్స్ ద్వారా అతడిని ముంబయికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నాడు.
గ్రీన్ ఫంగస్ గురించి శ్రీ అరబిందో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు చెందిన డాక్టర్ రవి దోసి కీలక విషయాలు వెల్లడించారు. గ్రీన్ ఫంగస్‌ను ఆస్పర్గిల్లోసిస్ ఇన్ఫెక్షన్ అని అంటారు. ఇది ఊపిరితిత్తులు, రక్తం, సైనస్పై ఎక్కువగా ప్రభావం చూపిస్తోంది. బ్లాక్ ఫంగస్‌కు, గ్రీన్ ఫంగస్‌కు వేర్వేరు మందులు ఉంటాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఉన్నవారికి ఈ గ్రీన్ ఫంగస్ వల్ల ఎక్కువగా ప్రమాదం ఉంటుంది.
ముక్కులో నుంచి రక్తం కారడం, తీవ్ర జ్వరం, బలహీనంగా ఉండటం, బరువు తగ్గడం, దగ్గు వంటివి గ్రీన్ ఫంగస్ లక్షణాలుగా డాక్టర్ రవి దోసి తెలిపారు. ఇండోర్‌లో గ్రీన్ ఫంగస్ సోకిన బాధితుడికి ఈ అన్ని లక్షణాలు ఉన్నాయని ఆయన వివరించారు. గ్రీన్ ఫంగస్ మాత్రమే కాదు ఏ ఫంగల్ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండటానికి వైద్యులు కొన్ని జాగ్రత్తలు సూచిస్తున్నారు.
మనిషి పరిశుభ్రంగా లేకపోవడం, పరిసరాలు శుభ్రంగా లేకపోవడం వంటి కారణాల వల్ల గ్రీన్ ఫంగస్ సోకే ప్రమాదం ఉంటుంది. ఎక్కువగా దమ్ము, చెత్తాచెదారంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా రోజులుగా నిల్వ ఉంచిన నీటికి కూడా దూరంగా ఉండాలి. ఒకవేళ చెత్తాచెదారంలోకి వెళ్లాల్సి వస్తే కచ్చితంగా ఎన్95 మాస్కు ధరించాలి. బయటకు రాగానే చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవాలి.
సాధారణంగా గ్రీన్ ఫంగస్‌కు కారణమైన క్రిములు ఇంటాబయటా ఉంటాయి. ఈ సూక్ష్మ క్రిములు మనిషి శరీరంలోకి శ్వాస ద్వారా వెళుతుంటాయి. అయితే, రోగ నిరోధక శక్తి బలంగా ఉన్నవారికి, సాధారణ వ్యక్తులకు ఈ సూక్ష్మ క్రిములు శరీరంలోపలికి వెళ్లినా ఇన్ఫెక్షన్ సోకదు. అయితే, కోవిడ్ వంటి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న వారికి, కోలుకున్న వారికి ఇన్ఫెక్షన్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, కరోనా నుంచి కోలుకున్న వారు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. గ్రీన్ ఫంగస్ ఒకరి నుంచి మరొకరికి సోకదు.