తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పనా శాఖ మంత్రి సిహెచ్ మల్లారెడ్డిపై భూకబ్జా కేసు నమోదైంది. ఓ మహిళకు చెందిన భూమిని తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమించుకోవడమే కాకుండా తనను చంపుతామని బెదిరిపింపులకు పాల్పడుతున్నారని బాధితురాలు హై కోర్టును ఆశ్రయించింది. దీంతో మంత్రితో పాటుగా ఆయన కుమారుడు భద్రారెడ్డి, మరో ఐదుగురు అనుచరులపై దుండిగల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న వివరాల ప్రకారం.. పొన్నబోయిన శ్యామలా దేవి తల్లి పద్మావతి పేరు మీద మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం సూరారంలో సర్వే నంబరు 115 116 117లో 2.13 ఎకరాల భూమి ఉంది. అయితే అది మంత్రి మల్లారెడ్డికి చెందిన రెండు ఆసుపత్రుల మధ్య లో ఉంది. ఈ భూమిని తనకు అమ్మాలంటూ మల్లారెడ్డి శ్యామలాదేవిపై ఒత్తిడి తెచ్చారు. వినకపోవడంతో తప్పుడు పత్రాలు సృష్టించి 20 గుంటల భూమిని కబ్జా చేయడంతో పాటుగా మిగిలిన భూమిని కూడా తనకే విక్రయిచాలని బెదిరింపులకు పాల్పడుతున్నట్టుగా ఫిర్యాదు లో పేర్కొన్నారు.
తనకు మంత్రి అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయిస్తే వారు పట్టించుకోలేదని శ్యామలా దేవీ పేర్కొన్నారు. గతంలో తన తల్లి పద్మావతితో కలిసి పిటిషన్ వేసేందుకు న్యాయవాది లక్ష్మి నారాయణను ఆశ్రయిస్తే అతను మంత్రి అనుచరులతో చేతులు కలిపి నకిలీ స్టాంప్ పేపర్ల మీద సంతకం తీసుకున్నారని ఆమె పేర్కొంది. దీంతో ఆమె హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. ఆమె పిటిషన్ ను విచారించిన కోర్టు మంత్రి, అతని అనుచరులపై కేసు నమోదు చేయాలనీ దుండిగల్ పోలీసులను ఆదేశించింది.
ఈ మేరకు ఈ కేసులో మంత్రి మల్లారెడ్డి(ఏ1), భద్రారెడ్డి (ఏ2) ఎం.రాజు (ఏ3) న్యాయవాది లక్ష్మీనారాయణ (ఏ4) మస్తాన్ (ఏ5) పుల్లయ్య (ఏ6) చంద్రయ్య (ఏ7)లతో పాటుగా మరికొందరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. కాగా ఈ కేసుపై తాజాగా మల్లారెడ్డి స్పందించారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు. అసలు శ్యామల ఎవరో తనకు తెలియదన్నారు. తాను ఎలాంటి బెదిరింపులకు పాల్పడలేదని ఆయన వివరణ ఇచ్చుకున్నారు.