వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ప్రాణంగా ప్రేమించుకున్నారు. జీవితాంతం కలిసి బతకాలనుకున్నారు. తమ పెళ్లి గురించి పెద్దలకు చెప్పారు. పిల్లల ఇష్టమే మా ఇష్టం అని పెద్దలు కూడా భావించారు. పెళ్లికి అంగీకరించారు. అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాలని నిశ్చయించారు. దీంతో ఆ ప్రేమ జంట తమ వైవాహిక జీవితంపై ఎన్నెన్నో కలలు కంటోంది. కానీ, వీరు ఒకటి తలిస్తే.. విధి మరొకటి తలిచింది.
కర్ణాటకలోని తుమకూరు తాలుకా ఆరేహళ్లికి చెందిన ధనుష్(23), సుష్మా(22) చాలా రోజులుగా ప్రేమించుకొని ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. తాను కోరుకున్న అమ్మాయితో వివాహం నిశ్చయం కావడంతో ధనుష్ మొక్కు చెల్లించుకోవడానికి ఈ నెల 11వ తేదీన జాతరకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ధనుష్ మరణాన్ని సుష్మా జీర్ణించుకోలేకపోయింది. అతడు లేని జీవితం తనకు వద్దనుకుంది. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా అందరినీ కలిచివేస్తోంది.