ఇటీవల కాలంలో దేశంలో డిజిటల్ లావాదేవీలు విపరీతంగా పెరిగిపోయాయి. బ్యాంకుల చుట్టూ తిరిగే అవసరం లేకపోవడం, ట్రాన్సక్షన్స్ పై రివార్డు పాయింట్లు లభిస్తుండటంతో కస్టమర్లు డిజిటల్ లావాదేవీలపైనే ఎక్కవగా ఆసక్తి చూపుతున్నారు. అదే సమయంలో డిజిటల్ పేమెంట్స్ వల్ల కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో మార్చి 31, ఏప్రిల్ 1వ తేదీన కొన్ని ప్రైవేటు బ్యాంకులు పని చేయలేదు. ఈ సమయంలో చాలా మందికి ఆన్ లైన్ ట్రాన్సక్షన్స్ ఫెయిల్ అయ్యాయి. ఈ సమయంలో కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది.
ఎన్ఈఎఫ్టీ, ఐఎంపీఎస్, యూపీఐ లాంటి ట్రాన్సక్షన్స్ జరిపే సమయంలో మన అకౌంట్ నుంచి డబ్బులు క్రెడిట్ అయినా అవి బెనిఫిషరీ అకౌంట్ లో జమ కాకపోవడం లాంటివి జరిగాయి. కొంత మందికి కొన్ని గంటల వ్యవధిలో డబ్బులు వెనక్కి వచ్చాయి. మరికొంత మందికి మాత్రం చాలా సమయం పట్టింది. ఈ నేపథ్యంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఈ విషయంపై ఫిర్యాదులు వెల్లువెత్తతున్నాయి.
2019 సెప్టెంబర్ లో ఆర్బీఐ ఇందుకు సంబందించిన ఒక సర్క్యులర్ ను జారీ చేసింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయిన నిర్ణీత సమయం తర్వాత కూడా డబ్బు రీఫండ్ కాకపోతే బ్యాంకులు ఆ కస్టమర్ కు పరిహారం చెల్లించవలసి ఉంటుంది. ట్రాన్సక్షన్స్ ఫెయిల్ అయ్యి కస్టమర్ అకౌంట్ నుంచి డబ్బులు డిడక్ట్ అయిన టీ +1 రోజుల్లో డబ్బు తిరిగి ఖాతాలో జమ కావాలి. కస్టమర్లు ఈ విషయాన్ని కస్టమర్ కేర్ దృష్టికి తీసుకువెళితే డబ్బు రీ ఫండ్ అయ్యే వరకు రోజుకి రూ. 100 పరిహారం చెల్లిస్తాయి. మీ పూర్తి వివరాలను తెలిపి కంప్లైంట్ రైజ్ చేయాలి. మీ ఫిర్యాదు సరైనదేనని భావిస్తే సర్వీస్ ప్రొవైడర్ మీకు డబ్బులు చెల్లిస్తాడు. ఒక వేళ ఫిర్యాదు చేసినా బ్యాంకులు స్పందించకపోతే కస్టమర్లు ఆర్బీఐ అంబుడ్స్ మెన్ స్కీం ఆఫ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్- 2019 కింద కంప్లైంట్ చేయవచ్చు.