కరోనా వ్యాక్సిన్‌పై ఇంత ప్రచారం కలిపిస్తున్నా ఇంకా చాలా మందిలో అపోహలు మాత్రం పోవడం లేదు. సోషల్ మీడియా దుష్ప్రచారాల పుణ్యమా అని ఇంకా వ్యాక్సిన్‌పై చాలా మందిలో అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు, వీడియోలో వైరల్‌గా మారాయి. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారి శరీరం అయస్కాంతంలాగా మారిపోతోందని ప్రచారం జరుగుతోంది.
ఇందుకు సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్నాయి. కొందరి శరీరాలకు స్పూన్లు, ఇతర ఇనుప వస్తువులు అతుక్కుంటున్నట్లుగా ఈ ఫోటోలు, వీడియోల్లో ఉంది. దీంతో మరోసారి వ్యాక్సిన్‌పై కొందరిలో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ ఈ వైరల్ వార్తకు సంబంధించి స్పష్టతనిచ్చింది.
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారి శరీరాలు అయస్కాంతంగా మారుతున్నాయని వస్తున్న వార్తలు అబద్ధమని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. వ్యాక్సిన్ల వల్ల మానవ శరీరంలో ఎటువంటి మ్యాగ్నెటిక్ రియాక్షన్ జరగదని తెలిపింది. కరోనా వ్యాక్సిన్లు పూర్తిగా సురక్షితమైనవని, వ్యాక్సిన్లలో ఎటువంటి మెటల్‌కు సంబంధించి పదార్థాలు ఉండవని వివరించింది.
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొద్దిగా తలనొప్పి రావడం, జ్వరం, వ్యాక్సిన్ ఇచ్చిన చోట నొప్పి వంటి సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే వస్తాయని స్పష్టం చేసింది. కరోనా వ్యాక్సిన్లకు సంబంధించి ఎటువంటి తప్పుడు వార్తలను నమ్మొద్దని పీఐబీ కోరింది. ఫేక్ న్యూస్ కూడా వైరస్ లానే ప్రమాదకరమని, కాబట్టి వీటి విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇప్పుడిప్పుడే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం అవుతోంది. ఇటువంటి సమయంలో వైరల్ ఫోటోలు, ఫేక్ న్యూస్ వల్ల మళ్లీ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంది.
Several posts/videos claiming that #COVID19 #vaccines can make people magnetic are doing the rounds on social media. #PIBFactCheck:
✅COVID-19 vaccines do NOT make people magnetic and are completely SAFE
Register for #LargestVaccineDrive now and GET VACCINATED ‼️ pic.twitter.com/pqIFaq9Dyt
— PIB Fact Check (@PIBFactCheck) June 10, 2021