వాతావరణంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోవడంతో ఆ ప్రభావం కంటి ఆరోగ్యంపై పడుతుంది. తరచుగా కళ్ళు మండుతుండటం, దురద లాంటివి చికాకు పుట్టిస్తాయి. ఎండలకు తోడు రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పని చేసేవారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. వేడి చేసే పదార్థాలను తింటే మరుసటి రోజున ఆ వేడికి కళ్ళు మండటం మొదలవుతాయి.
అయితే కళ్ళలో మంటలు, దురద లాంటివి కనిపిస్తే అశ్రద్ధ చేయవద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఈ సమస్యలకు అలర్జీ కూడా ఓక కారణం కావచ్చు. అతి చల్లదనం, ఎక్కువగా ఎండలో తిరగడం, వివిధ రకాల కాస్మెటిక్స్ వాడటం వల్ల అలర్జీలు వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే తరచుగా చల్లని నేటితో కళ్ళను కడుగుతూ ఉండాలి. కళ్ళకు రెస్ట్ ఇస్తుండాలి. పని మధ్యలో విరామం తీసుకునేవారు స్మార్ట్ ఫోన్ కు వీలైనంత దూరంగా ఉంటె కళ్ళకు విశ్రాంతి లభిస్తుంది.
ఆహారంలో కళ్ళ ఆరోగ్యానికి అవసరమయ్యే పదార్థాలను చేర్చుకోవాలి. ఆకుకూరలు, క్యారెట్లు ఎక్కువగా తినాలి. ఈ సమస్య నుంచి వెంటనే ఉపశమనం పొందాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి. గ్రీన్ టీ బాగ్స్ ను కళ్ళ పై ఉంచుకోవచ్చు. కాటన్ ప్యాడ్స్ ను చల్లని పాలలో ముంచి కంటిపై ఉంచుకోవాలి. ఇలా పది నిముషాలు ఉంచితే వెంటనే ఫలితం ఉంటుంది.
కీరదోస ముక్కలు కళ్ళపై పెట్టుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది. ప్రతి రోజు రోజ్ వాటర్ తో కళ్ళను కడిగితే కళ్ళకు విశ్రాంతి లభిస్తుంది. ఆలుగడ్డ ముక్కలను గుండ్రంగా కోసి ఫ్రిడ్జ్ లో ఉంచి వాటిని కళ్లపై పెట్టుకుంటే మంట, దురద తగ్గడమే కాకుండా డార్క్ సర్కిల్స్ కూడా తగ్గిపోతాయి. వీటితో పాటుగా శరీరాన్ని చల్లబరిచే పదార్థాలను తీసుకోవాలి.