వేసవి అంటేనే మండే ఎండలు. దానికి తోడు చెమట. ఈ సమస్య చికాకు పుట్టించడమే కాకండా ముఖ్యమైన సందర్భాలలో సైతం అసౌకర్యాన్ని కలిగిస్తాయి. కొంతమందికి సహజంగానే చెమట ఎక్కువగా పడుతుంది. ఎన్ని పౌడర్లు వాడినా, సబ్బులు మార్చినా ఎలాంటి ఫలితం ఉండదు. అయితే ఈ అధిక చెమటసమస్యను తగ్గించేందుకు కొన్ని చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
చెమట ఎక్కువగా పట్టడమనేది ఒక రకమైన సమస్య. దీనినే హైపర్ హైడ్రోసిస్ అంటారు. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు, ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, ఆందోళన ఇలా అనేక కారణాల వల్ల శరీరం చెమటను ఎక్కువగా విడుదల చేస్తుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి కెఫీన్ పదార్థాలకు దూరంగా ఉండాలి. కాఫీలు, టీలు తగ్గించాలి. ఇందులో ఉండే కెఫీన్ వల్ల చెమట ఎక్కువగా పడుతుంది. ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, ఆల్కహాల్, వెల్లుల్లి, ఉల్లిపాయలు, అధిక కొవ్వు కలిగిన ఆహార పదార్థాలు, కారం తగ్గించాలి.
చెమట ఎక్కువగా రాకుండా ఉండాలంటే ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఉపయోగించండి. గోరు వెచ్చని నీటిలో ఆపిల్ సైడర్ వెనిగర్ ను వేసి చెమట ఎక్కువగా వచ్చే శరీర భాగాలు, పాదాలు, చేతుల్లోరాయండి. కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. దీనిలో ఉండే ఆమ్ల గుణాల వల్ల చెమటను ఎక్కువగా రానీయదు.
మరో రకంగా బేకింగ్ సోడా, కార్న్ ఫ్లోర్ ను సమపాళ్లలో కలిపి దానికి కొంచెం ఎసెన్షియల్ ఆయిల్ ను కలపండి. చెమట పట్టే అండర్ ఆర్మ్స్ లాంటి భాగాల్లో రాయాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇది చెమటను తగ్గించడమే కాకుండా శరీర దుర్వాసన దూరమయ్యేలా చేస్తుంది. బంగాళా దుంపలకు కూడా అధిక చెమటను నివారించే గుణం ఉంటుంది. స్నానానికి ముందు బంగాళా దుంపలను శరీరంపై రాసుకోవడం వల్ల చెమటను నివారించంచడమే కాకుండా మచ్చలు దూరమవుతాయి. ముల్తానీ మట్టితో ప్యాక్ వేసుకోవడం వల్ల చెమట గ్రంథుల్లన్నీ క్లీన్ అయ్యి తాజాగా ఉంటారు.