కరోనా, లాక్డౌన్ కారణంగా ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నందున కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్ఓలో చందాదారులుగా ఉండే కార్మికులు, ఉద్యోగులు కరోనా అడ్వాన్సు కింద వారి పీఎఫ్ అకౌంట్లో ఉండే డబ్బును కొంత తీసుకునే అవకాశం కల్పించింది. అంటే, పీఎఫ్ ఖాతా ఉన్న వారు ఎవరైనా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నట్లయితే వారి అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవచ్చు.
దీనిని కరోనా అడ్వాన్స్‌గా పిలుస్తున్నారు. వారి ఖాతాలో ఉన్న మొత్తం బ్యాలెన్స్‌లో 75 శాతం లేదా మూడు నెలల బేసిక్ పే జీతంలో ఏది తక్కువ అయితే అంత డబ్బును కరోనా అడ్వాన్స్ కింద పీఎఫ్ ఖాతాదారులు పొందవచ్చు. సాధారణంగా పీఎఫ్ డబ్బులు ఏవైనా అవసరాల కోసం తీసుకోవాలంటే ప్రాసెస్ మొత్తం పూర్తయ్యి డబ్బులు రావడానికి కనీసం 20 రోజులు పడుతుంది. కానీ, కరోనా అడ్వాన్స్ కోసం వచ్చే క్లయిమ్‌లను 3 రోజుల్లో పరిష్కరించాలని కేంద్రం నిర్ణయించింది.
కరోనా కారణంగా పీఎఫ్ అడ్వాన్స్ తీసుకునే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం గతంలో కరోనా ఫస్ట్ వేవ్ సమయంలోనూ కల్పించింది. అప్పుడు కరోనా అడ్వాన్స్ తీసుకున్నవారు కూడా ఇప్పుడు మరోసారి కరోనా అడ్వాన్స్ తీసుకునే అవకాశం ఇచ్చింది. అయితే, కేవలం పీఎఫ్ ఖాతాదారులకు, వారి ఖాతాలో డబ్బులు ఉన్న వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. అడ్వాన్స్‌గా తీసుకునే డబ్బులు కూడా వారి ఖాతాలోనివే.
ప్రస్తుతం కరోనా ప్రభావం, లాక్డౌన్ కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. లాక్డౌన్లో చాలా మందికి ఉద్యోగాలు కూడా లేవు. అనేక మంది కరోనా బారిన కూడా పడ్డారు. ఈ నేపథ్యంలో వీరిని ఆర్థిక కష్టాలు కూడా వెంటాడుతున్నాయి. ఇటువంటి వారికి కేంద్రం ఇచ్చిన ఈ అవకావం కొంత ఊరట కలిగిస్తుంది.