జమిలి ఎన్నికలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. 2022 లో జమిలి ఎన్నికల నిర్వహణకు కేంద్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ‘ఒకే దేశం.. ఒకే ఎలక్షన్’ నినాదంతో బీజేపీ ప్రభుత్వం ముందుకు వెళుతుంది. దేశంలో నిరంతరం జరిగే ఎన్నికల ప్రక్రియ ద్వారా భారీగా ప్రజాధనం వృథా అవుతుందని ఫలితంగా అభివృద్ధి కుంటుపడుతుందని కేంద్రం భావిస్తుంది.
కాగా పార్లమెంటుతో సహా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విషయమై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని గతంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. తాజాగా ఈ అంశంపై ఎన్నికల సంఘం స్పందించింది. చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ సునీల్ అరోరా జమిలి ఎన్నికలకు మద్దతు తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ కోరుతున్న విధంగానే జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధమని అన్నారు. ఎన్నికల నిర్వహణపై పార్లమెంటులో సవరణలు చేసిన తర్వాత ఈ ప్రక్రియ చేపడతామన్నారు. అందుకోసం ఒకే ఓటర్ల జాబితాతో పాటుగా ఇతర ఏర్పాట్లను కూడా చేస్తున్నట్టుగా వెల్లడించారు.