logo

పంచాయతీ ఎన్నికలపై ఈసీ కీలక నిర్ణయం.. అభ్యర్థుల్లో టెన్షన్!

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. పంచాయతీ ఎన్నికలు అయినప్పటికీ ఈ ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య భారీ పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా రాజకీయ పార్టీలకు అతీతంగా పంచాయతీ ఎన్నికలు ఉంటాయి. పార్టీ గుర్తులను కాకుండా ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తులనే అభ్యర్థులకు కేటాయిస్తారు.

ఇప్పటికీ సిద్ధమైన బ్యాలెట్ పేపర్లలో ఇకపై నోటా గుర్తును కూడా ముద్రించాలని ఈసీ నిర్ణయించింది. బ్యాలెట్ పేపర్లలో అభ్యర్థుల గుర్తుల కింద నోటా కనిపిస్తుంది. 2013 కు ముందు తమకు ఇష్టం లేని అభ్యర్థులకు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఓట్లు వేసి ఎన్నుకోవాల్సి వచ్చేది. కానీ నోటా వచ్చిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి తమకు నచ్చకుంటే వారు నోటాను ఎంచుకునే వెసులుబాటును ఎన్నికల సంఘం కల్పించింది. అయితే పంచాయతీ ఎన్నికల్లో నోటా గుర్తును ఉంచడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఈ నిర్ణయం ఇప్పుడు అభ్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. సాధారణ ఎన్నికల్లో భారీ సంఖ్యలో ఓటర్లు పాల్గొంటారు. నోటాకు ఎక్కువ ఓట్లు వెళ్లినా ఆ ప్రభావం అంతగా ఉండేది కాదు. కానీ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. దీంతో స్వల్ప ఓట్ల తేడాతోనే అభ్యర్థుల జాతకాలు తలకిందులయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనా నోటా ఈ పంచాయతీ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించనుంది.

Related News