తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక యాక్టీవ్ పాలిటిక్స్ నుంచి విశ్రాంతి తీసుకుంటారని, మంత్రి కేటీఆర్‌ను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడతారని చాలా రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ఫలానా తేదీ నాడు కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని అనేకసార్లు ప్రచారం కూడా జరిగినా నిజం కాలేదు. ఇప్పుడు మరోసారి కేటీఆర్ ముఖ్యమంత్రి కానున్నారని పెద్ద ఎత్తున పార్టీలో ప్రచారం మొదలైంది.
టీఆర్ఎస్ కీలక నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలే కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అని చెబుతున్నారు. తాజాగా టీఆర్ఎస్ కీలక నేత, మంత్రి ఈటెల రాజేందర్ కూడా ఈ విషయంలో క్లారిటీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఓ ఇంటర్వ్యూలో ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి మార్పు ఉంటే ఉండొచ్చని, ఉంటే తప్పేంటని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోతే అనేకసార్లు ఆ పాత్రను కేటీఆర్ పోషిస్తారని ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు.
టీఆర్ఎస్ పార్టీలోని కీలక నాయకుల్లో ఈటెల రాజేందర్ ఒకరు. ఉద్యమ సమయంలో అసెంబ్లీలో ఆ పార్టీకి ఫ్లోర్ లీడర్‌గా పని చేశారు. పార్టీ నిర్ణయాలకు సంబంధించి ఈటెల అభిప్రాయాలు కూడా కీలకంగా ఉంటాయి. ఇప్పుడు ఈటెలనే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని హింట్ ఇవ్వడంతో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు తర్వాత కేటీఆర్‌ను సీఎం చేస్తారని తాజాగా బాగా ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కేటీఆర్‌ను తర్వాతి సీఎంగానే భావిస్తున్నారు. ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు తాపత్రయపడుతున్నారు. కేటీఆర్ కూడా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్‌గా పార్టీలో, మంత్రిగా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తూ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనాల్సిన అనేక కార్యక్రమాల్లో కేటీఆర్ పాల్గొంటున్నారు. ప్రభుత్వాన్ని నడిపించడంలోనూ కేటీఆర్‌దే కీలక పాత్ర.
కాబట్టి, పార్టీని, ప్రభుత్వాన్ని నడింపించడానికి కావాల్సిన అనుభవం కేటీఆర్‌కు ఉందని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. తానే ముఖ్యమంత్రిగా ఉంటానని, తన ఆరోగ్యం కూడా బాగుందని ఇంతకుముందు కేసీఆర్ చెప్పారు. అయినా కూడా టీఆర్ఎస్ నేతలే కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అని పదేపదే చెబుతున్నారు. తాజాగా ఈటెల రాజేందర్ కామెంట్స్‌తో కేటీఆర్‌ను సీఎం చేసే అవకాశం ఉందనేది స్పష్టమవుతోంది.