ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కొత్త జిల్లాల్లో భాగంగా రాజమహేంద్రవరం నగరం కేంద్రంగా జిల్లా ఏర్పాటైంది. ఈ జిల్లాను తూర్పు గోదావరి లేదా రాజమహేంద్రవరం అని పిలుస్తారు. ఇంతకాలం కూడా రాజమహేంద్రవరం తూర్పు గోదావరి జిల్లాలోనే ఉండేది. ఈ జిల్లాకు కాకినాడ నగరం జిల్లా కేంద్రంగా ఉండేది. ఇప్పుడు మాత్రం రాజమహేంద్రవరం కేంద్రంగానే కొత్త జిల్లా ఉండనుంది.
రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం ఆధారంగా కొత్త జిల్లా ఏర్పాటైంది. రాజమహేంద్రవరం జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండనున్నాయి. అనపర్తి, రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గాలు రాజమహేంద్రవరం జిల్లాలో ఉన్నాయి. రాజమహేంద్రవరం, కొవ్వూరు రెవెన్యూ జిల్లాలు ఉన్నాయి.
ఈ జిల్లాలో మొత్తం 20 మండలాలు ఉన్నాయి. రాజమహేంద్రవరం జిల్లా విస్తీర్ణం 2,709 చదరపు కిలోమీటర్లుగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ జిల్లాలో 19.03 లక్షల జనాభా ఉంది. జిల్లాలో రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్తో పాటు కొవ్వూరు, నిడదవోలు మున్సిపాలిటీలు ఉండనున్నాయి. దాదాపుగా 200కు పైగా రెవెన్యూ గ్రామాలు ఉంటాయి.
రాజమహేంద్రవరంలోనే జిల్లా కార్యాలయాలు, కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా జరిగాయి. ఉగాధి నుంచి కొత్త జిల్లా ప్రారంభం కానుంది. పవిత్ర గోదావరి నది ఒడ్డున ఉండే రాజమహేంద్రవరం జిల్లా ప్రత్యేకతను చాటుకోనుంది.