దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఇటీవల ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాకకు ఉప ఎన్నిక అనివార్యమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 10న నోటిఫికేషన్ రానుంది. అక్టోబరు 16 వరకు నామినేషన్ల స్వీకరణకు తుది గడువు ఉంటుంది. నవంబర్ 3న పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 10 ఓట్ల లెక్కింపు ఉంటుంది.
దుబ్బాక నియోజకవర్గంలో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. అభ్యర్థులు ఎవరనేది ఇంకా ఖరారు కాకపోయినా నేతలు గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించారు. టీఆర్ఎస్ తరపున రామలింగారెడ్డి కుమారుడు లేదా భార్య బరిలో ఉంటారనే ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి కూడా టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
టీఆర్ఎస్ తరపున మంత్రి హరీష్‌రావు ఇప్పటికే దుబ్బాక నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌రావు పోటీ చేయడం దాదాపు ఖాయమే. ఆయన ఇప్పటికే పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల పేరుతో ప్రచారం ప్రారంభించారు. ఇక, కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి ఎవరనేది ఖరారు కాలేదు. దీంతో టీఆర్ఎస్, బీజేపీతో పోల్చితే కాంగ్రెస్ కొంత వెనుకబడింది.