కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల్లో మన భారత్ రెండో స్థానంలో ఉంది. దేశంలో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ పైన అంతా ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ ట్రయల్స్ మన దేశంలో జరుగుతున్నాయి. దీనితో పాటు రెండు దేశీయ సంస్థలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ట్రయల్స్ రెండో దశలో ఉన్నాయి. అయితే, ఎంత వేగంగా ట్రయల్స్, అనుమతులు పూర్తైనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేది వచ్చే సంవత్సరమే అనే అంచనాలు ఉన్నాయి.
కానీ, కరోనా వ్యాక్సిన్ ఈ సంవత్సరమే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రష్యాతో మన హైదరాబాద్ కేంద్రంగా నడిచే డాక్టర్ రెడ్డీస్ సంస్థ చేసుకున్న ఒప్పందమే దీనికి కారణం. కరోనా వ్యాక్సిన్‌ను మొదట రిజిస్టర్ చేసిన దేశంగా రష్యా నిలిచింది. రష్యాలోని గమలెయా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, రష్యన్ డిఫెన్స్ మినిస్ట్రీ కలిసి స్పుత్నిక్ వి అనే వ్యాక్సిన్‌ను తయారుచేశాయి. ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం రష్యాలో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
అయితే, భారత్‌లో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలంటే నిబంధనల ప్రకారం మన దేశంలో ఫేజ్ 3 ట్రయల్స్ జరగాలి. ఈ ట్రయల్స్ జరిపేందుకు కీలక ముందడుగు పడింది. ఇందుకు గానూ రష్యాతో డాక్టర్ రెడ్డీస్ సంస్థ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు మన దేశంలో రష్యా కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి ఫేస్ 3 ట్రయల్స్ జరపడంతో పాటు డాక్టర్ రెడ్డీస్‌కు 10 కోట్ల డోసులను సరఫరా చేయనుంది. ఒకవేళ 3వ దశ ట్రయల్స్ విజయవంతమై, వ్యాక్సిన్ వినియోగాయినికి అనుమతులు వస్తే ఈ నవంబర్లోనే రష్యా వ్యాక్సిన్ భారత్‌లో అందుబాటులో వచ్చే అవకాశాలు ఉన్నాయి.