logo

  BREAKING NEWS

మ‌ళ్లీ తెర‌పైన శ్రీహ‌రి, సౌంద‌ర్య‌ను చూసే అరుదైన‌ అవ‌కాశం  |   కేసీఆర్‌తో గొడ‌వ ఎక్క‌డ మొద‌లైందో చెప్పిన కోదండ‌రాం  |   ఆర్థిక ఇబ్బందుల్లో ప్ర‌ధాని.. ఈ క‌ష్టాలు ఎవ‌రికీ రావేమో..!  |   క‌ర్నూలు మ‌హిళ‌కు దొరికిన‌ కోటి రూపా‌యల వ‌జ్రం  |   బ్రేకింగ్‌: క‌రోనా వ్యాక్సిన్‌పై ప్ర‌ధాని మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌  |   ద‌సరా పండుగ రోజు జ‌మ్మి చెట్టుకు ఎందుకు పూజిస్తారో తెలుసా ?  |   హైద‌రాబాద్ వ‌ర‌ద‌లు.. భారీగా విరాళాలు ప్ర‌క‌టించిన హీరోలు  |   ఫిబ్ర‌వ‌రి నాటికి స‌గం మందికి క‌రోనా వైర‌స్‌  |   రాబిన్ శ‌ర్మ‌తో చంద్ర‌బాబు ఒప్పందం..! ఆయ‌న ట్రాక్ రికార్డ్ తెలుసా..?  |   Breaking: వ‌ర‌ద బాధితుల‌కు భారీ సాయం ప్ర‌క‌టించిన కేసీఆర్‌  |  

ఈ విల‌న్ దానం చేసిన ఆస్తి విలువ రూ.500 కోట్లు

ఆయ‌న సినిమాల్లో విల‌న్‌. కానీ, నిజ జీవితంలో హీరో. మ‌న‌ము ఎంతో అభిమానించే రీల్ హీరోల కంటే పెద్ద రియ‌ల్ హీరో. ఆయ‌న పేరు ప్ర‌భాక‌ర్ రెడ్డి. పూర్తి పేరు మందాడి ప్ర‌భాక‌ర్ రెడ్డి. మ‌నం అభిమానించే హీరోలు ఎవ‌రైనా ఒక‌రిని ఆదుకుంటేనే మా హీరో మ‌న‌సు బంగారం అని చెప్పుకుంటాం. మా హీరో దాన‌క‌ర్ణుడ‌ని అంటుంటాం. క‌ష్టం తెలిసిన రియ‌ల్ హీరో అని కీర్తిస్తుంటాం. కానీ, ఇటువంటి హీరోలు ఎవ‌రూ చేయ‌లేని గొప్ప ప‌నిని ప్ర‌భాక‌ర్ రెడ్డి చేశారు. హైద‌రాబాద్‌లో కొంత స్థ‌లం ఉంటే స్టూడియోనో, సినిమా హాలో క‌ట్టుకుంటున్న హీరోలు ఉన్న స‌మ‌యంలో ప్ర‌భాక‌ర్ రెడ్డి త‌న భూమిని సినీ కార్మికుల‌కు ఇళ్ల స్థ‌లాల కోసం దానం చేశారు.

ఇప్పుడు ఈ స్థ‌లంలోనే చిత్ర‌పురం కాల‌నీ ఏర్ప‌డింది. సినిమాల‌నే న‌మ్ముకొని జీవ‌నం సాగిస్తున్న సినీ కార్మికుల‌కు గూడు ఇవ్వాల‌నే ఆలోచ‌న‌తో ప్ర‌భాక‌ర్ రెడ్డి దానం చేసిన భూమి విలువ ఇప్పుడు అక్ష‌రాలా 500 కోట్లు. ఆయ‌న చ‌ల‌వ వ‌ల్లే ఇప్పుడు సినీ కార్మికులంతా స్వంతింట్లో ఉంటున్నారు. అందుకే మ‌నం గొప్ప‌గా చెప్పుకుంటూ అభిమానించే హీరోల కంటే ప్ర‌భాక‌ర్ రెడ్డి వెయ్యి రెట్లు గొప్ప వారు. ఆయ‌న సినిమాల్లో విల‌న్ కావ‌చ్చు కానీ నిజ జీవితంలో మాత్రం హీరో.

ప్ర‌భాక‌ర్ రెడ్డి స్వ‌స్థ‌లం ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాలోని తుంగ‌తుర్తి. ఎంబీబీఎస్ చ‌దివిన ప్ర‌భాక‌ర్ రెడ్డి డాక్ట‌ర్ కావాల్సి యాక్ట‌ర‌య్యారు. 1961లో చివ‌ర‌కు మిగిలేది సినిమా ద్వారా న‌ట‌న‌లోకి అడుగుపెట్టారు. 400పైగా సినిమాల్లో న‌టించారు. ఇందులో ఎక్కువ‌గా విల‌న్ పాత్ర‌లు వేశారు. అందుకే ప్ర‌భాక‌ర్ రెడ్డిని చూడ‌గానే విల‌న్ అనే అభిప్రాయం మ‌న‌లో చాలా మందికి క‌లుగుతుంది. జ‌య‌ప్ర‌ద మూవీస్ పేరుతో ఆయ‌న సినిమాలు కూడా నిర్మించారు. ప‌లు సినిమాల‌కు క‌థ‌లు అందించారు.

ఈ క్ర‌మంలో ఆనాటి హీరోల‌కు ధీటుగా డ‌బ్బులు సంపాదించారు. చిత్ర ప‌రిశ్ర‌మ మ‌ద్రాస్ నుంచి హైద‌రాబాద్ వ‌చ్చిన‌ప్పుడు అప్ప‌టి హీరోల‌తో పాటు సినిమా ఇండ‌స్ట్రీలో స్థిర‌ప‌డిన చాలా మంది హైద‌రాబాద్‌లో స్థ‌లాలు కొనుగోలు చేశారు. ప్ర‌భాక‌ర్ రెడ్డి కూడా వారితో పాటు గ‌చ్చిబౌలి స‌మీపంలో ప‌దెక‌రాల స్థ‌లం కొన్నారు. అయితే, ఆనాటి హీరోలంతా హైద‌రాబాద్‌లోని త‌మ స్థ‌లాల్లో విలాస‌వంత‌మైన ఇళ్లు, సినిమా హాళ్లు, సినీ స్టూడియోలు నిర్మించుకున్నారు.

ప్ర‌భాక‌ర్ రెడ్డి మాత్రం త‌న స్థ‌లాన్ని సినిమాలే జీవితంగా బ‌తుకుతున్న సినీ కార్మికుల‌కు దానంగా ఇచ్చారు. మ‌ద్రాస్‌లో ఉన్న‌ప్పుడు కూడా ఆయ‌న సినీ కార్మికుల‌ను బాగా చూసుకునే వారు. ఎంద‌రికో త‌న ఇంట్లోనే ఆశ్ర‌యం ఇచ్చేవారు. ప‌రిశ్ర‌మ హైద‌రాబాద్‌కు వ‌చ్చాక ఆయ‌న సినీ కార్మికుల సంక్షేమం కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్ సినీ కార్మికుల స‌మాఖ్య‌ను ఏర్పాటు చేసి దానికి అధ్య‌క్షుడిగా ప‌ని చేశారు. హైద‌రాబాద్ వంటి మ‌హాన‌గ‌రంలో సినీ కార్మికుల స‌గం సంపాద‌న ఇంటి అద్దెల‌కే పోతున్నందున వారికి ఒక స్వంతిల్లు ఉంటే బాగుంతుంద‌ని అనుకున్నారు.

ఇందుకు గానూ తానే ఒక‌డుగు ముందుకేసి త‌న 10 ఎక‌రాల భూమిని సినీ కార్మికుల ఇళ్ల స్థ‌లాల‌కు కేటాయించారు. ప్ర‌భుత్వాన్ని ఒప్పించి మ‌రికొంత భూమి ఇప్పించారు. ఇలా సినీ కార్మికుల కోస‌మే చిత్ర‌పురి కాల‌నీ ఏర్పాటైంది. ఇప్పుడు ఇది చుట్టూ సాఫ్ట్‌వేర్ కంపెనీలు, ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్ వంటి వాటి మ‌ధ్య‌లో ఉంటుంది. ఈ కాల‌నీలో ఇళ్ల స్థ‌లాల విలువ విప‌రీతంగా పెరిగింది. ఈ ప్రాంతంలో ఒక ఎక‌రం ధ‌ర క‌నీసం రూ.50 కోట్లు ఉంటుంది. అంటే, ప్ర‌భాక‌ర్ రెడ్డి దానం చేసిన స్థ‌లం విలువ ప్ర‌స్తుతం రూ.500 కోట్ల‌కు పైనే ఉంటుంది.

ప్ర‌భాక‌ర్ రెడ్డి చొర‌వ వ‌ల్ల చిత్ర‌పురి కాల‌నీలో ఇళ్ల స్థ‌లాలు పొందిన సినీ కార్మికులంతా చిన్న చిన్న ఇళ్ల‌ను నిర్మించుకొని ఇంటి అద్దెల బాధ‌ను త‌ప్పించుకున్నారు. సంపాదించే డ‌బ్బుల‌తో కుటుంబాన్ని హాయిగా పోషించుకుంటున్నారు. త‌మ కోసం ఇంత చేసిన ప్ర‌భాక‌ర్ రెడ్డిని వారు ఎప్ప‌టికీ మ‌రిచిపోరు. అందుకే, ఆయ‌న‌కు గుర్తుగా త‌మ కాల‌నీకి డాక్ట‌ర్ ఎం.ప్ర‌భాక‌ర్ రెడ్డి చిత్ర‌పురి కాల‌నీగా పేరు పెట్టుకున్నారు. 62 ఏళ్ల వ‌య‌స్సులో 1997లో ప్ర‌భాక‌ర్ రెడ్డి తుదిశ్వాస విడిచారు. సినిమాల కోసం, సినీ కార్మికుల కోసం ఇంత చేసిన ప్ర‌భాక‌ర్ రెడ్డికి ఎందుకో ఇండ‌స్ట్రీలో ద‌క్కాల్సినంత గౌర‌వం ద‌క్క‌లేద‌నే చెప్పాలి.

Related News