ఏడాది పాటు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనాకు విరుగుడుగా వ్యాక్సిన్ వచ్చేసింది. మన దేశంలోనూ, మన రాష్ట్రంలోనూ, మన ఊరిలోనూ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. అయితే, వైరస్ ప్రభావం మొదలైన కొత్తలో మనకు ఉన్న భయం ఇప్పుడు లేదు. సరిగ్గా ఏడాది క్రితం కరోనాకు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని వేయి కళ్లతో ఎదురుచూసిన మనమే ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత దానిపైన అంత ఆసక్తి చూపించడం లేదు.
మనలో చాలామంది కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి అంత ఆసక్తి చూపించడం లేదు. కరోనా వైరస్ సోకినా 99 శాతం మంది ఎటువంటి ప్రాణాపాయం లేకుండా కోలుకుంటుండటంతో చాలామందిలో వైరస్ అంటే భయం పోయింది. అయితే, వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు రావాలని శాస్త్రవేత్తలు, వైద్యులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో వైరస్ అందరూ వేసుకోవాలా ? ఒకసారి కరోనా వచ్చి తగ్గిపోయిన వారు కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలా ? అనే అనుమానాలు చాలామందిలో ఉన్నాయి. వీటికి వైద్యులు సమాధానాలు ఇస్తున్నారు.
వ్యాక్సిన్ అందరూ వేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా వైరస్‌కు వేగంగా మ్యుటేట్ అయ్యే గుణం ఉందని, కాబట్టి, ఇప్పుడు వైరస్ ప్రభావం తగ్గినా మళ్లీ విజృంభించే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. వైరస్ నుంచి పూర్తిస్థాయిలో రక్షణ ఇచ్చేది కేవలం వ్యాక్సిన్ మాత్రమేనని, కాబట్టి అందరూ వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు రావాలని కోరుతున్నారు. కేవలం 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వారు, గర్భిణులు, బాలింతలు తప్ప మిగతా అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని చెబుతున్నారు.
ఇక వ్యాక్సిన్‌కు సంబంధించి మనలో చాలామందికి ఒక అనుమానం ఉంది. ఒకసారి కరోనా సోకి తగ్గిపోయిన వారు వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం లేదని చాలామందిలో ఒక అపోహ ఉంది. కానీ, ఇది నిజం కాదని, వైరస్ సోకి కోలుకున్న వారు కూడా వ్యాక్సిన్ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. కరోనా సోకి కోలుకున్న వారిలో యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి. కానీ, అవి మళ్లీ వైరస్ సోకకుండా పూర్తిస్థాయి రక్షణ ఇస్తాయని మాత్రం ఇంకా తేలలేదు. కేవలం మళ్లీ కరోనా సోకినప్పుడు ప్రాణాపాయం నుంచి రక్షణ ఇస్తాయని మాత్రమే వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
కాబట్టి, ఒకసారి కరోనా వైరస్ సోకి తగ్గిపోయిన వారు కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మనలో చాలామంది ఇప్పటికే వైరస్ బారిన పడి కోలుకున్నారు. ఇలా కోలుకున్న వారిలో కొందరికి మళ్లీ వైరస్ సోకిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. అయితే, కరోనా సోకి పూర్తిగా కోలుకోకముందు, కరోనా లక్షణాలు ఉన్నప్పుడు మాత్రం వ్యాక్సిన్ వేయించుకోవద్దు. వైరస్ తగ్గిన తర్వాతనే వ్యాక్సినేషన్ చేయించుకోవాలి.