కొన్ని నెలల క్రితమే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన హుజురాబాద్ నియోజకవర్గ నేత పాడి కౌశీక్ రెడ్డికి బంపర్ ఆఫర్ తగిలే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ పదవి కూడా ఆయనకు ఇక దక్కదనే ప్రచారం జరుగుతున్న సమయంలో కేవలం ఎమ్మెల్సీ మాత్రమే కాదు మరో కీలక పదవి కూడా దక్కనుందని తెలుస్తోంది. కౌశీక్ రెడ్డి విషయంలో టీఆర్ఎస్ అధిష్ఠానం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటలకు ధీటుగా కౌశీక్ రెడ్డిని నిలపాలనే ఆలోచనతో ఉంది.
హుజురాబాద్ నియోజకవర్గంలో చాలా శ్రమించిన తర్వాత కూడా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఈటల రాజేందర్ వ్యక్తిగత ఇమేజ్ ముందుగా టీఆర్ఎస్ ప్రయత్నాలు ఫలించలేదు. హుజురాబాద్‌లో గెలుపుతో ఈటల రాజేందర్ రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగే దారిలో ఉన్నారు. బీజేపీ కూడా కేవలం హుజురాబాద్‌కే ఆయనను పరిమితం చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఆయనను సీఎం అభ్యర్థిగా కూడా ప్రకటించినా ఆశ్చర్యం లేదనే ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్‌పైన టీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ చేసింది. వచ్చే ఎన్నికల్లో హుజురాబాద్‌లో ఈటలకు గట్టి పోటీ ఉంటే ఆయన తన నియోజకవర్గానికే పరిమితం కావాల్సి వస్తుంది. ఇలా చేయడం ద్వారా ఆయనను రాష్ట్రమంతా తిరగకుండా చేయాలనే ఆలోచన టీఆర్ఎస్లో ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే, ఉప ఎన్నికల ఓటమిని వదిలేసి మరో రెండేళ్లలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈటలకు ఎలా అడ్డుకట్ట వేయాలని ఆలోచిస్తోంది.
ఈ నేపథ్యంలో టీఆర్ఎస్కు కౌశీక్ రెడ్డి కొంత ఉపయోగకరంగా కనిపిస్తున్నారు. 2018 ఎన్నికల్లో ఈటల రాజేందర్‌కు, హరీశ్‌రావు, కేటీఆర్లానే సుమారు లక్ష మెజారిటీ రావాల్సి ఉండేది. అందరూ ఇదే ఊహించారు. కానీ, ఈటల మెజారిటీ ఏకంగా 40 వేలకు పడిపోయింది. కౌశీక్ రెడ్డి ఏకంగా 60 వేల ఓట్లు తెచ్చుకొని ఈటలకు గట్టి పోటీ ఇచ్చారు. కాబట్టి, ఈటలకు కౌశీక్ రెడ్డి అయితేనే అడ్డుకట్ట వేయవచ్చనే భావన టీఆర్ఎస్లో ఉన్నట్లు తెలుస్తోంది.
కౌశీక్ రెడ్డిని ఎమ్మెల్సీగా ఎంపిక చేయాలనే సిఫార్సును గవర్నర్ పక్కనపెట్టినందున ఎమ్మెల్యే కోటాలో ఆయనను ఎమ్మెల్సీ చేసే అవకాశం ఉంది. అంతేకాదు, ఆయనకు హుజురాబాద్ బాధ్యతలు పూర్తిగా అప్పగించడంతో పాటు శాసనమండలి విప్ పదవిని కూడా ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. తద్వారా ఈటల రాజేందర్ స్థాయికి తగ్గట్లుగా కౌశీక్ రెడ్డిని బలోపేతం చేయాలనేది టీఆర్ఎస్ ఆలోచనగా కనిపిస్తోంది. అందుకే, కౌశీక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవితో పాటు డబుల్ ప్రమోషన్‌గా మరో పదవి కూడా దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది.