వాక్సిన్లతో ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని నిపుణులు చెప్తున్నా ప్రజల్లో మాత్రం ఇందుకు సంబందించిన ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులైన బీపీ, షుగర్ ఉన్నవారు వాక్సిన్ తీసుకోవచ్చా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే డయాబెటిస్ ఉన్నవారిపై కోవిడ్ మహమ్మారి తీవ్రంగా ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. అందుకే
అందుకే బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు వాక్సిన్ వేసుకోవడం తప్పనిసరి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వీరు వాక్సిన్ వేసుకోవడం అత్యవసరం. టైప్ 1, టైప్ 2 మధుమేహం ఉన్నవారికి వాక్సిన్ తప్పనిసరి అని ఇదివరకే సీడీసీ నొక్కి చెప్పింది. మధుమేహం ఉన్నవారిలో మాత్రమే కాకుండా ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిలో సైతం వాక్సిన్ లు మంచి ఫలితాలను ఇస్తున్నాయని వెల్లడైంది.
అయితే షుగర్ ఉన్నవారు వాక్సిన్ తీసుకునే ముందు కచ్చితంగా షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచుకోవాలి. అలాగే అధిక రక్తపోటు ఉన్నవారు కూడా దానిని అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే ప్రమాదం తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు పేర్కొన్నారు. క్యాన్సర్ రోగులు, ముఖ్యంగా కీమోథెరపీ తీసుకుంటున్నవారు తప్పనిసరిగా వైద్య సలహా మేరకు టీకా తీసుకోవాలి.
ఒక్క మధుమేహ వ్యాధిగ్రస్తులే కాక హెచ్ఐవీ, ఎస్టీడీ లాంటి వ్యాధులు ఉన్నవారు కూడా ముందగా వారి జబ్బును అదుపులో ఉంచుకున్న తర్వాతనే వాక్సిన్ తీసుకోవాలని పేర్కొన్నారు. వీరు వాక్సిన్ తీసుకునే సమయంలో ఆందోళన చెందకుండా రిలాక్స్ గా ఉండే ప్రయత్నం చేయాలి. కోవిడ్ -19 చికిత్సలో భాగంగా బ్లడ్ ప్లాస్మా లేదా మోనోక్లోనల్ యాంటీబాడీస్ పొందిన వ్యక్తులు, ఇప్పటికే కరోనా నుంచి కోలుకున్న వారు మాత్రం రెండు నెలల వరకు వ్యాక్సిన్ తీసుకునే అవసరం లేదని నిపుణులు సూచించారు.