పెళ్లిచూపులు సినిమాతో దర్శకుడిగా పరిచయమైన తరుణ్ భాస్కర్ టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత దర్శకుడు కమ్ హీరోగా మారి టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నాడు. కాగా తరుణ్ భాస్కర్ ను కొందరు స్టార్ హీరోల అభిమానులు వేధించడం మొదలు పెట్టారు. దీంతో ఆయన సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు.
వివరాల్లోకి వెళితే.. తరుణ్ భాస్కర్ ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాలో మలయాళం సినిమా ‘కప్పేలా’ను చూశానని తెలిపాడు. సినిమా అద్భుతంగా ఉంది. తనకెంతో నచ్చిందని పేర్కొన్నాడు. సినిమా గురించి వివరిస్తూ హీరో అరవడాలు లేవు, మాస్ అప్పీల్ లేదు, అనవసరపు సన్నివేశాలు లేవు అంటూ ఓ పెద్ద పోస్ట్ ను రాసుకొచ్చాడు.
దీంతో సదరు స్టార్ హీరోల అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. మా హీరోలని ఉద్దేశించే ఈ పోస్ట్ చేశాడంటూ ఆయనపై ట్రోల్స్ తో విరుచుకుపడ్డారు. వారిలో కొందరు అసభ్యపదజాలంతో దూషించడంతో పాటు బెదిరింపులకు దిగడంతో తరుణ్ భాస్కర్ వెంటనే సైబరాబాద్ పోలీస్ స్టేషన్ లో సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసాడు. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరాడు.